31న బ్యాంకులు ఓపెన్‌

31న బ్యాంకులు ఓపెన్‌

న్యూఢిల్లీ: వచ్చే నెల 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండడంతో  2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన  అన్ని ప్రభుత్వ లావాదేవీల లెక్కింపును పూర్తి చేయడానికి ఈ నెల 31న స్పెషల్ క్లియరింగ్ ఆపరేషన్స్‌‌ను ఆర్‌‌‌‌బీఐ నిర్వహిస్తోంది. ఇందులో అన్ని బ్యాంకులు పాల్గొనాలని ఆదేశించింది. ఇండియాలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ కొనసాగుతుంది.  దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను కార్యాలయాలు, సీజీఎస్‌‌టీ కార్యాలయాలు  మార్చి 29, 30, 31 తేదీలలో తెరిచి ఉంటాయి. 

రంజాన్‌‌, వారాంతం అయినప్పటికీ ఇవి పనిచేస్తాయి.  ప్రభుత్వ రసీదులు,  చెల్లింపులను చూసుకుంటున్న అన్ని శాఖలను మార్చి 31, 2025న ఓపెన్‌‌లో ఉంచాలని బ్యాంకులకు ఆర్‌‌‌‌బీఐ ఆదేశించింది.  ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించిన కౌంటర్ యథావిదిగా కొనసాగుతుంది.  చెక్ ట్రంకేషన్ సిస్టమ్‌‌ (సీటీఎస్) కూడా ఎప్పటిలాగానే పనిచేస్తుంది.

ఈ నెల 29,30,31న  ఎల్‌ఐసీ ఆఫీసులు ఓపెన్‌

పాలసీ హోల్డర్ల కోసం ఈ నెల   29,30, 31 తేదీలలో తమ జోన్లు, డివిజన్లన్నీ ఓపెన్‌లో ఉంటాయని ఎల్‌ఐసీ ప్రకటించింది. వారంతం అయినా 2024–25 ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో ఎల్‌ఐసీ  ఎప్పటిలాగానే  ఓపెన్‌లో ఉంటుందని తెలిపింది.