మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు గ్లైపోసెట్

  •     దొంగచాటుగా తరలిస్తున్న వ్యాపారులు, దళారులు 
  •     ఆన్​లైన్​లో ఆర్డర్​ పెడితే సప్లై చేస్తున్న పలు కంపెనీలు 
  •     గ్లైపోసెట్​తో క్యాన్సర్​ సహా ప్రమాదకర వ్యాధులు 
  •     పత్తిలో కలుపు నివారణకు వినియోగిస్తున్న రైతులు
  •     గ్లైసిల్​కాటన్​ను అరికడితేనే గ్లైపోసెట్​ కంట్రోల్​

మంచిర్యాల, వెలుగు: నిషేధిత గ్లైపోసెట్​గడ్డి మందు మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. మహారాష్ట్ర బోర్డర్​ ప్రాంతాలకు చెందిన కొంతమంది ఫర్టిలైజర్స్​వ్యాపారులు, దళారులు దొంగచాటుగా తీసుకొచ్చి ఇక్కడి రైతులకు అమ్ముతున్నారు. దీనిపై నిఘా ఉండడంతో మరికొందరు ఆన్​లైన్​లో ఆర్డర్లు పెట్టి తెప్పిస్తున్నారు. ప్రభుత్వం ఎంతగా కంట్రోల్​చేయాలని చూసినా ఈ దందా ఆగడం లేదు. ఇప్పటికే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు భారీగా స్టాక్​ చేరినట్టు తెలుస్తోంది. అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరించడంతో గ్లైపోసెట్​దందా విచ్చలవిడిగా సాగుతోంది. 

లక్ష ఎకరాల్లో నిషేధిత గ్లైసిల్​ సీడ్

రైతులు ప్రధానంగా పత్తి పంటలో కలుపు నివారణకు గ్లైపోసెట్​ను వాడుతున్నారు. జిల్లాలో సుమారు 1.75 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఇందులో దాదాపు లక్ష ఎకరాల్లో నిషేధిత గ్లైసిల్​ సీడ్ ​వేస్తున్నారు. గ్లైపోసెట్​ కొడితే పత్తి మొక్కలకు ఎలాంటి నష్టం లేకుండా గడ్డి మాత్రమే చనిపోతుంది. కూలీలతో కలుపు తీయాలంటే చాలా కష్టమైన పని. గత కొన్నేండ్లుగా కూలీ రేట్లు పెరగడంతో పాటు కూలీల కొరత కారణంగా చాలా మంది రైతులు గ్లైసిల్ ​సీడ్ ​సాగు చేస్తూ కలుపు నివారణకు గ్లైపోసెట్​ గడ్డి మందు వాడుతున్నారు. ప్రమాదకరమైన ఈ మందు వినియోగాన్ని అరికట్టాలంటే ముందుగా గ్లైసిల్​ సీడ్​ సాగు కంట్రోల్​చేయాలి. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు.

10 లీటర్ల క్యాన్​రూ.10 వేలకు..

గతంలో గ్లైపోసెట్​హైదరాబాద్​ నుంచి వివిధ ప్రాంతాలకు గుట్టుగా సప్లై జరిగేది. ఇప్పుడు పక్కనున్న మహారాష్ట్రలో విచ్చలవిడిగా దొరుకుతోంది. లీటర్​కు రూ.500 నుంచి రూ.600 చొప్పున 10 లీటర్ల క్యాన్​ రూ.5వేల నుంచి రూ.6వేలకే లభిస్తోంది. ట్రాన్స్​పోర్టు ఖర్చులు, మామూళ్లు, కమీషన్లు చూసుకొని ఇక్కడి రైతులకు రూ.10వేల వరకు అమ్ముతున్నారు. ఇప్పటికే చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, తాండూర్ మండలాలకు భారీగా స్టాక్​ చేరినట్టు సమాచారం. ప్రస్తుతం జిల్లా నుంచి నాగపూర్​ మార్కెట్​కు మామిడి కాయలను తరలిస్తున్న వ్యాపారులు వచ్చేటప్పుడు ఆ బండ్లలో గ్లైపోసెట్ తీసుకొస్తున్నారు. బోర్డర్​లోని ఇంటర్​ స్టేట్​ చెక్​పోస్టులతో పాటు జిల్లాలోని చెక్​పోస్టులను దాటుకొని వస్తున్నారు. చెన్నూర్, బెల్లంపల్లి ఏరియాలకు సమీపంలోని సిరొంచ నుంచి సప్లై చేస్తున్నారు. మంచిర్యాలలోని వ్యాపారులు ఇతర ప్రాంతాలను కవర్​ చేస్తున్నారు. 

ఆర్డర్లు పెట్టి.. రహస్య స్థావరాల్లో నిల్వ చేసి..

రాష్ట్రంలో గ్లైపోసెట్​పై నిషేధం ఉండడంతో వ్యాపారులు, దళారులు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతున్నారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఆన్​లైన్​సేవలను ఇందుకు వినియోగించుకుంటున్నారు. వివిధ కంపెనీలు ఆన్​లైన్​లో ఆర్డర్​పెట్టిన అడ్రస్​కే నేరుగా గ్లైపోసెట్ క్యాన్లను సప్లై చేస్తున్నాయి. దీంతో పలువురు ఫర్టిలైజర్స్​వ్యాపారులు లీటర్​ నుంచి ఐదు లీటర్ల క్యాన్లను ఆన్​లైన్​ ద్వారా తెప్పిస్తున్నారు. సదరు కంపెనీలు ఎవరికీ అనుమానం రాకుండా ప్యాకింగ్​చేసి పంపుతున్నాయి. వాటిని గోదాముల్లో కాకుండా రహస్య స్థావరాల్లో నిల్వ చేసి రైతులకు గుట్టుగా సప్లై చేస్తున్నారు. ఇప్పటికే గ్లైసిల్​సీడ్​ను కొనిపెట్టుకున్న రైతులు గ్లైపోసెట్​ సైతం సమకూర్చుకుంటున్నారు. జిల్లాలో జూన్​ మొదటివారంలో పత్తి సీజన్​ ప్రారంభమయ్యే సమయానికి రేట్లు పెరిగే అవకాశం ఉండడంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.  

క్యాన్సర్,​ పంటల దిగుబడిపై ఎఫెక్ట్

హెచ్​టీ (హెర్బిసైడ్ టోలరెంట్) కాటన్​ సీడ్​ను ఉత్పత్తి చేస్తున్న విదేశీ కార్పొరేట్​ కంపెనీలే గ్లైపోసెట్​ గడ్డిమందును సైతం తయారు చేస్తున్నాయి. హెచ్​టీ​ కాటన్​ విత్తనాలనే లోకల్​గా గ్లైసిల్​ పేరిట అమ్ముతున్నారు. వీటిలో కలుపు నివారణకు గ్లైపోసెట్​ను వాడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన మందుగా అనేక పరిశోధనల్లో తేలింది. దీని ప్రభావం కారణంగా క్యాన్సర్​ సహా పలు రోగాలు వస్తాయని రుజువైంది.

క్రమంగా భూసారం క్షీణించి పంటల దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని నిరూపితమైంది. దీంతో భారత్​తో పాటు పలు దేశాల్లో హెచ్​టీ కాటన్​తో పాటు గ్లైపోసెట్​పై నిషేధం కొనసాగుతోంది. మనదేశంలో టీ తోటల్లో పరిమితంగా వినియోగించడానికి మాత్రమే అనుమతి ఉంది. కానీ విచ్చలవిడిగా దొరుకుతుండడంతో జిల్లాలో రైతులు గత పదేండ్లుగా ఈ గడ్డిమందును వాడుతున్నారు. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని రైతు కుటుంబాల్లో క్యాన్సర్​ పేషెంట్ల సంఖ్య ఏటేటా పెరుగుతున్నట్టు తెలుస్తోంది.