- భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్లలో కలకలం
- వాజేడులో కనిపించిన మావోయిస్ట్ వ్యతిరేక కరపత్రాలు
భద్రాచలం, వెలుగు : ఈ నెల 2 నుంచి పీఎల్‌జీఏ (పీపుల్స్ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాలు జరుపుకోవాలంటూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో శనివారం మావోయిస్ట్ బ్యానర్లు వెలిశాయి. చత్తీస్‌గఢ్ బార్డల్‌లోని చర్ల మండలంలోని పూసుగుప్ప – వద్దిపాడు ప్రధాన రహదారిపై రొట్టెంతవాగు సమీపంలో ఆజాద్ పేరుతో బ్యానర్లు కనిపించాయి. డిసెంబరు 2 నుంచి 8 వరకు పీఎల్‌జీఏ వారోత్సవాలను ఘనంగా జరపాలని, ప్రతీ ఒక్కరూ పీఎల్‌జీఏలో చేరారని సూచించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
మన్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
వెంకటాపురం, వెలుగు : ‘మావోయిస్టులకు ఆదివాసీ ప్రాణాలంటే లెక్క లేదా ? అంటూ వాజేడు మండలం చెరుకూరు గ్రామంలో శనివారం కరపత్రాలు కనిపించాయి. ఇటీవల హత్యకు గురైన సెక్రటరీ రమేశ్, అర్జున్‌ల ఫొటోలతో పాటు ‘మావోయిస్టులను తరిమికొడుదాం... అడవిని కాపాడుకుందా’ అనే నినాదంతో ఆదివాసీ ఐక్యవేదిక పేరుతో పాంప్లెంట్లు వెలిశాయి.
ఆదివాసీలను అడవిలోకి రావొద్దని నిర్బంధిస్తూ, అమాయక ఆదివాసీలను కొరియర్లుగా ముద్ర వేస్తూ హత్య చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీలను బానిసలుగా మార్చుకొని నిత్యావసర వస్తువులు, సరుకులు తెప్పించుకుంటున్నారన్నారు. అలాగే ఆదివాసీలను చంపితే ఊరుకునేది లేదంటూ కరపత్రాలు కనిపించాయి.