బూర్గంపహాడ్, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సందెళ్ల రామాపురంలో సీపీఐ మావోయిస్ట్ పేరుతో బ్యానర్లు, పోస్టర్లు కనిపించాయి. ‘ఆపరేషన్ కగార్ ను ఓడించండి, మావోయిస్ట్ పార్టీ 20వ వారోత్సవాలను ధృడసంకల్పంతో జరుపుకోండి’ అంటూ మణుగూరు, పాల్వంచ డివిజన్ పేరుతో పోస్టర్లు కనిపించడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం ఇదే గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ బీకేఏఎస్ ఆర్ డివిజన్ కమిటీ పేరుతో కరపత్రాలు కనిపించగా
తాజాగా సీపీఐ మావోయిస్ట్ పేరుతో బ్యానర్, కరపత్రాలు వెలుగుచూడడం చర్చనీయాంశమైంది. బ్యానర్ల విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం గ్రామానికి చేరుకొని వాటిని తొలగించారు. ఓ వైపు ఎన్ కౌంటర్లు జరుగుతుండడం, మరోవైపు మావోయిస్ట్ బ్యానర్లు వెలుస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.