కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కనుంది..? సిద్దరామయ్యకా...? లేక డీకే శివకుమార్ కా..? ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా నడుస్తోంది. ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనే చర్చ మొదలైంది. మే 14వ తేదీ సాయంత్రం కాంగ్రెస్ పార్టీ.. తమ ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బెంగళూరులోని షాంగ్రీ లా హోటల్‌లో సాయంత్రం 6 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సైతం ఆశిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని సీఎం పీఠం వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
https://twitter.com/ANI/status/1657602610596319238
ప్రస్తుతం కర్ణాటకలో పోస్టర్ వార్ కొనసాగుతోంది. సిద్ధరామయ్య కాబోయే ముఖ్యమంత్రిగా పేర్కొంటూ పోస్టర్‌లు వెలిశాయి. ఇటు డీకే శివకుమార్‌కు సైతం మద్దతుగా పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. ఇందులో కాబోయే ముఖ్యమంత్రి అంటూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ పోస్టర్లపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి స్పందించారు. ప్రతి ఒక్కరికీ కోరికలు, ఆశయాలు ఉంటాయన్నారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్యకే కాకుండా ఎంబీ పాటిల్, జీ పరమేశ్వరన్ కు కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని.. ముఖ్యమంత్రి ఎవరనేది హైకమాండ్, ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తారని వివరించారు.
https://twitter.com/ANI/status/1657589630940884993
సిద్ధరామయ్య, డీకే శివకుమార్... ఇద్దరు కీలక నేతలు సీఎం సీటు కోసం పోటీపడుతుండడంతో ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర సిద్ధరామయ్య కర్ణాటక ప్రజల ప్రయోజనాల కోసం తన తండ్రి సిద్ధరామయ్యే మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అదే సమయంలో శివకుమార్ మద్దతుదారులు మాత్రమే ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. డీకే శివకుమార్ 1989 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ ఓటమి చెందలేదు. మరో వైపు సిద్ధరామయ్యకు 75 సంవత్సరాలు కాగా.. ఆయనకు ఇవే చివరి ఎన్నికలుగా కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.
ఆదివారం (మే 14న) సీఎల్పీ భేటీలో సీఎల్పీ నేతలను ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశం ఉండగా.. సీఎం ఎంపికపైనా సాయంత్రంకల్లా ఓ స్పష్టత వచ్చే చాన్స్ ఉంది. సీఎం అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. సోమవారం (మే 16వ తేదీన) బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార ప్రోగ్రామ్‌కు ఏర్పాట్లు చేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.