- దేవరగట్టుకు వెళ్తూ గుండెపోటుతో బాలుడు మృతి
కర్నూలు జిల్లా: దసరా సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా నిర్వహించే బన్ని ఉత్సవం ముగిసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగే కర్రల సమరంలో 50 మందికి పైగా గాయపడ్డారు. సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై ఉన్న మాల మల్లేశ్వర స్వామి ఆలయంలోని ఉత్సవ మూర్తులను అర్ధరాత్రి 12 గంటలకు కొండ కిందకు తీసుకొచ్చి ఊరేగింపుగా గ్రామాలకు వెళ్తున్న సందర్భంగా కర్రలతో వెళ్తున్న వారి మధ్య తొక్కిసలాట జరిగింది. నెరణికి,నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు.. అరికెర, అరికెతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల వారు మరోవైపు ఉండి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు ప్రయత్నించారు.
అర్ధరాత్రి దాటిన తర్వాతి నుంచి తెల్లవారే వరకు మొత్తం 50 మందికిపైగా గాయపడ్డారు. వారికి ముగ్గురు సీనియర్ సర్జన్లతో కూడిన మెడికల్ టీమ్ వైద్యం అందించింది. గ్రామాల్లో ఊరేగింపు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి తీసుకుని వచ్చారు. కర్రల సమరం శృతి మించకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఉత్సవాలు ముగిశాయి. దేవరగట్టుకు వెళ్తున్న ఓ బాలుడు గుండెపోటుతో చనిపోయాడు. మృతుడు కర్ణాటక రాష్ట్రం శిరుగుప్పకు చెందిన రవీంద్రానాథ్ రెడ్డి అని పోలీసులు వెల్లడించారు.
ఏటా దసరా పండుగ రోజున దేవరగట్టు కొండపై వెలసిన శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించే బన్ని ఉత్సవం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పొరుగున ఉన్న కర్నాటక వారికి చాలా ముఖ్యమైన పండుగ. చుట్టూ కొండల మద్య ఉన్న దేవరగట్టు వద్ద జరిగే బన్ని ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. పక్కనే ఉన్న కర్నాటక నుంచి కూడా భారీ సంఖ్యలో తరలివస్తారు.