పర్మిషన్స్ లేకుండానే..లాడ్జీలు, బాంకెట్​ హాల్స్

పర్మిషన్స్ లేకుండానే..లాడ్జీలు, బాంకెట్​ హాల్స్
  • టాక్స్  ఎగ్గొట్టేందుకు రెసిడెన్షియల్  పర్మిషన్లతో నిర్వహణ
  • గద్వాల మున్సిపల్  ఆదాయానికి భారీగా గండి

గద్వాల, వెలుగు: జిల్లా కేంద్రంలో పర్మిషన్స్  లేకుండానే పుట్ట గొడుగుల్లా బాంకెట్, ఫంక్షన్  హాల్స్, లాడ్జీలు పుట్టుకొస్తున్నాయి. కమర్షియల్  పర్మిషన్లు తీసుకొని రూల్స్  ప్రకారం నిర్వహించాల్సి ఉండగా, గద్వాల మున్సిపాలిటీలో రెసిడెన్షియల్  పర్మిషన్లతో నడిపిస్తూ మున్సిపల్  ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.

సెట్  బ్యాక్  లేకుండా రూల్స్ కు విరుద్ధంగా పార్కింగ్  లేకుండా వీటిని నిర్వహిస్తుండడంతో ఇబ్బందులు వస్తున్నాయి. లాడ్జీలు, బాంకెట్​ హాల్స్ లో తప్పనిసరిగా పార్కింగ్, ఫైర్​ సేఫ్టీ ఎక్విప్​మెంట్స్​ అందుబాటులో ఉంచాలి. కానీ, ఇవేమి లేకుండానే నిర్వహిస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

అనుమతులు కొన్నింటికే..

గద్వాల పట్టణంలోని రాజా వీధిలో ఫంక్షన్ హాల్స్, గద్వాల–కర్నూల్  రోడ్  వెంబడి బాంకెట్​ హాల్స్, లాడ్జీలు, షాపింగ్  కాంప్లెక్స్ లు వెలిశాయి. ఇటీవల కర్నూల్  రోడ్డు వెంట పదుల సంఖ్యలో బాంకెట్ హాల్స్, లాడ్జీలు వెలిశాయి. 14 లాడ్జీలు ఉండగా, మూడింటికి, 8 ఫంక్షన్  హాళ్లలో మూడింటికి మాత్రమే పర్మిషన్లు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో 15 బాంకెట్​ హాల్స్  ఉండగా, వీటిలో  ఒక్కదానికి కూడా పర్మిషన్  లేదు.

జములమ్మ వద్ద 30కి పైగా చిన్న చిన్న ఫంక్షన్  హాల్స్  ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దానికి కూడా పర్మిషన్  లేదు. అలాగే రెసిడెన్షియల్  పర్మిషన్లతో కమర్షియల్  కాంప్లెక్స్ లు కట్టేస్తున్నారు. కమర్షియల్​ టాక్స్, రెసిడెన్షియల్  టాక్స్ కి చాలా తేడా ఉంటుంది. కమర్షియల్  పర్మిషన్లు తీసుకుంటే తప్పనిసరిగా ఏడాదిలో వచ్చే కిరాయిలో దాదాపు రెండు నెలల కిరాయిని టాక్స్  రూపంలో కట్టాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్  పర్మిషన్లు తీసుకొని బ్యాంకులు, రెస్టారెంట్లు, హోటళ్లు, క్లాత్, కిరాణా షాపులు, మెడికల్  స్టోర్లకు రెంట్​కు ఇస్తున్నారు. 

Also Read :- తెలంగాణలో 200 కొత్త గ్రామ పంచాయతీలు.!

ఇటీవల గాంధీ చౌక్ లో  రెసిడెన్షియల్ పర్మిషన్  తీసుకొని షాపింగ్  కాంప్లెక్స్ కడుతూ చిత్తారి వీధికి వెళ్లే గల్లీ రోడ్డును కబ్జా చేస్తున్నారని కాలనీవాసులు మున్సిపల్  ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. గ్రౌండ్  ఫ్లోర్ కు మాత్రమే పర్మిషన్  తీసుకొని ఫస్ట్  ఫ్లోర్  నిర్మిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పట్టించుకోని మున్సిపల్​ ఆఫీసర్లు..

నిబంధనలకు విరుద్ధంగా గద్వాల పట్టణంలో లాడ్జీలు, బాంకెట్ హాల్స్, ఫంక్షన్  హాల్స్  వెలుస్తున్నా మున్సిపల్​ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఎవరైనా ఇంటి నిర్మాణంలో నిబంధనలు పాటించకుంటే హంగామా చేసే టౌన్  ప్లానింగ్  ఆఫీసర్లు.. రెసిడెన్షియల్  పర్మిషన్ తో నిర్మాణాలు చేపట్టి, అందులో బిజినెస్  చేస్తున్నా పట్టించుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మున్సిపల్  స్థలాల్లో ప్రైవేట్  వ్యక్తుల దందా

మున్సిపల్  స్థలాల్లో డబ్బాలు, ఇతర వీధి వ్యాపారాలు ఏర్పాటు చేయించి ప్రైవేట్​ వ్యక్తులు ప్రతి నెలా వేల రూపాయలు కిరాయి వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మున్సిపల్  స్థలాల్లో డబ్బాలు, వీధి వ్యాపారాలు చేసుకునే వారు మున్సిపాలిటీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, గద్వాల మున్సిపాలిటీలో ప్రైవేట్​ వ్యక్తులు వేలకువేలు కిరాయి వసూలు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి..

మున్సిపాలిటీ నడవాలంటే టాక్స్​ వసూళ్లే కీలకం. ట్రేడ్  లైసెన్సులు, ఇంటి పన్ను, మున్సిపల్  షాపుల  కిరాయిలు, కమర్షియల్  టాక్స్​ వసూలు చేయాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్  పర్మిషన్లతో షాపులు కిరాయికి ఇస్తూ సొమ్ము చేసుకోవడంతో ట్యాక్స్​ అంతంతమాత్రంగా వసూలు అవుతోంది. దీంతో మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. కనీసం ఎంప్లాయిస్ కు జీతాలు కూడా  ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. 

కమర్షియల్  టాక్స్ పై దృష్టి పెడతాం..

గద్వాల మున్సిపాలిటీలో ప్రత్యేకంగా కమర్షియల్  జోన్  లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. లాడ్జీలు, బాంకెట్ హాల్స్  పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న మాట వాస్తవమే. వాటి పర్మిషన్లు పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కమర్షియల్​ టాక్స్​పై దృష్టి పెడతాం.- దశరథం, మున్సిపల్  కమిషనర్, గద్వాల