కోటగిరి, వెలుగు: నాలుగు నెలలుగా తమ గ్రామానికి తాగునీరు రావడంలేదని పోతంగల్ మండలం టాక్లి గ్రామస్తులు సోమవారం కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. టాక్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నాలుగైదు నెలలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందన్నారు.
అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని వాపోయారు. సెక్రెటరీకి చెబుదామంటే ఆయన 15 రోజులకో సారి గ్రామానికి వస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్య తీర్చాలని కోరారు. లేదంటే గ్రామస్తులమంతా కలిసి నిరాహార దీక్షకు దిగుతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.