సినీ రంగంలో మరో తార నేలరాలింది. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పి లహిరి (69) కన్నుమూశారు. ముంబైలోని క్రిటికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బప్పీ నెల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి ఈ మధ్యే డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయన ఆరోగ్యం మంగళవారం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబసభ్యులు డాక్టర్ ను ఇంటికి పిలిపించారు. డాక్టర్ సూచన మేరకు లహిరిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. పరిస్థితి విషమించడంతో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. బప్పి లహిరి గతేడాది ఏప్రిల్ లో కరోనా బారినపడ్డారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చికిత్స పొందారు.
బాలీవుడ్ సహా టాలీవుడ్ సినిమాలకు కూడా ఆయన సంగీతమందించారు. 1970 –80 లల్లో బప్పీ లహరి పాడిన, కంపోజ్ చేసిన ఎన్నో పాపులర్ సాంగ్స్ విడుదలయ్యాయి. తెలుగు, తమిళ, కన్నడ, గుజరాత్ సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. తెలుగులో సింహాసనం, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్ స్పెక్టర్, స్టేట్ రౌడీ, రౌడీగారి పెళ్లాం, దొంగాపోలీసు, బ్రహ్మ, నిప్పురవ్వ, బిగ్ బాస్, ఖైదీ ఇన్ స్పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు. ఇటీవలే విడుదలైన డిస్కో రాజా చిత్రంలో పాట పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా... గాయకుడిగానూ ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు.
బప్పీ లహరి అసలు పేరు అలోకేశ్ లహరి. ప్రముఖ గాయకుడు కిశోర్ కుమార్ బప్పీ లహరికి బంధువు. హిందీ చిత్రసీమకు డిస్కో పాటలను పరిచయం చేసిన ఘనత బప్పీ లహరిదే. డిస్కో పాటలతో పాటు ఎన్నో మెలోడియస్ గీతాలు స్వరపరిచారు బప్పీ లహరి. బప్పి లహరిని అభిమానులు ప్రేమగా బప్పి దా పేరుతో పిలుచుకుంటారు. చేతికి బ్రాస్ లైట్, మెడలో గోల్డ్ చైన్ తో ట్రైండ్ సెట్ చేశారు. గోల్డ్ ఈజ్ మై గాడ్ అనే కోట్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు బప్పి లహరి.
సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన రియాలిటీ షో బిగ్ బాస్ 15 లో బప్పి చివరిసారిగా కనిపించారు. బప్పీ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో పాటు, బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్, లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. డర్టీ పిక్చర్ సినిమాలోని ఊలా.. ఊలాలా పాటకు గాను బెస్ట్ ఐటం సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. 1985లో విడుదలైన షరాబీ చిత్రానికి తొలిసారిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆరు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డుకి నామినేట్ అయ్యారు. 2012లో మిర్చి మ్యూజిక్ అవార్డు అందుకున్నారు. 2018లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. జనవరి 1, 2014లో బీజేపీలో చేరారు. బంగారల్ లోని శ్రీరాంపూర్ నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేసి టీఎంసీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. బప్పి మృతి పట్ల ఆయన అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.