అచ్చంపేట, వెలుగు: బాపు, అంబేద్కర్ దేశానికి రెండు కళ్ల వంటి వారని, వారు సూచించిన మార్గాల్లో నడిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ అన్నారు. రిటైర్డ్ డీఈవో విజయ్‌కుమార్ అక్టోబర్ 2న అలంపూర్‌లో చేపట్టిన గాంధీ బాట సత్యశోధన యాత్ర శనివారం అచ్చంపేటకు చేరుకుంది. యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి అయిన సందర్భంగా అచ్చంపేటలో నిర్వహించిన కార్యక్రమానికి తుషార్ గాంధీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ఉన్నంత వరకు బాపు, అంబేద్కర్ పేర్లు చిరస్థాయిగా ఉంటారన్నారు. వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామ స్వరాజ్యానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అసత్యం, అహింసను వీడి సత్యశోధన మార్గంలో ప్రజలు నడిచేలా చూడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్.రెడ్డి, టీ శాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే చండా లింగయ్య, సంజయ్‌సింగ్, మాధవరెడ్డి, వెంకట్‌రెడ్డి, రంగారావు, రాజేందర్‌రెడ్డి, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్‌లు, సుదర్శన్, అనంతరెడ్డి, లక్ష్మీనారాయణ, పాపి శెట్టినరసింహ, సౌజన్య, బాలాజీ, గౌరీశంకర్ పాల్గొన్నారు.