మతిస్థిమితం లేక అట్ల చేసిండు.. తమ భూములు స్వీకరించవద్దని ఈవోకు విన్నపం

మతిస్థిమితం లేక అట్ల చేసిండు..  తమ భూములు స్వీకరించవద్దని ఈవోకు విన్నపం

తన కొడుకు తనని సరిగ్గా చూసుకోవడం లేదంటూ గత నెల ఏప్రిల్ 27వ తేదీన సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన కప్పెర బాపురెడ్డి అనే వ్యక్తి  తన రెండున్నర ఎకరాల భూమిని  కొండగట్టు అంజనేయ స్వామికి అప్పగిస్తూ  ఆలయ ఈవోకి డాక్యుమెంట్లు అందించిన  సంగతి తెలిసిందే.  

అయితే ఈ రోజు ఆలయ ఈవో చంద్రశేఖర్ ను  బాపురెడ్డి కొడుకు ప్రవీణ్, భార్య లక్ష్మి వెళ్లి కలిశారు.  బాపురెడ్డికి గత కొంతకాలంగా మతిస్థిమితం లేక తమతో పాటు ఉండటం లేదంటూ ఈవోకు వివరించారు తల్లికొడుకులు.  తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని తమ కుటుంబానికే దక్కేలా చూడాలంటూ ఆలయ ఈవోకి విజ్ఞప్తి చేశారు. గ్రామ పెద్దలను తీసుకుని తన దగ్గరకు వస్తే తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఆలయ ఈవో చంద్రశేఖర్. 

కప్పెర బాపురెడ్డికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ప్రవీణ్‌రెడ్డి ఉన్నారు. అందరికీ వివాహాలు జరిపించాడు. ప్రవీణ్‌రెడ్డి భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నాడు.  బాపురెడ్డి  కూడా హైదరాబాద్ లోనే ఉంటూ కూలి పని చేసుకుంటున్నాడు.  అయితే తనను ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదని సొంతగ్రామానికి వచ్చి తన భార్య లక్ష్మితో గొడవ పెట్టుకునన్నాడు. 

దీంతో తనకు సంబంధించిన ఆస్తిని కొండగట్టు అంజన్న ఆలయానికి రాసిస్తానని  బుధవారం ఆలయానికి వెళ్లి ఈవో చంద్రశేఖర్ ను కలిశాడు. తన ఆస్తిని ఆలయం పేరిట పట్టా చేయిస్తానని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరాడు. అయితే బాపురెడ్డి మతిస్థిమితం లేక అలా చేశాడంటూ ఆయన భార్య, కొడుకు ఈవోను కలిసి వివరించారు.  వారసత్వంగా వచ్చిన భూమిని తమ కుటుంబానికే దక్కేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు.