- ప్రెసిడెంట్‌గా గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రకటన
- డెమోక్రటిక్ అభ్యర్థిగా కమల పేరు దాదాపుగా ఖరారు
- 90 నిమిషాల్లోపే 16 కోట్ల విరాళాలు
న్యూయార్క్ : డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హారిస్ బిడ్‌ను అమెరికా మాజీ ప్రెసిడెంట్, డెమోక్రటిక్ సీనియర్ లీడర్ బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా సమర్థించారు. కమలకు మద్దతు తెలుపుతూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతున్న ఒక నిమిషం వీడియో శుక్రవారం వైరల్ అయింది. “నేను, మిచెల్.. మీ బిడ్‌ను సమర్థిస్తున్నామని చెప్పడానికి కాల్ చేశాం.
ఎన్నికల ద్వారా ఓవల్ ఆఫీస్(అమెరికా ప్రెసిడెంట్కార్యాలయం)లోకి మిమ్మల్ని తీసుకురావడానికి మేము చేయగలిగినదంతా చేస్తం” అని ఒబామా.. కమలతో ఫోన్లో పేర్కొన్నారు. అలాగే ‘‘నేను నిన్ను చూసి గర్విస్తున్న.. ఇది చారిత్రాత్మకం అవుతుంది”అని మిచెల్ హారిస్‌తో చెప్పారు. ‘‘మీ ఇద్దరికీ ధన్యవాదాలు. ఇది ఎంతో గొప్ప విషయం. మీ మద్దతు మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది” అని చిరునవ్వులు చిందిస్తూ హారిస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
90 నిమిషాల్లోపే16 కోట్ల విరాళాలు
డెమోక్రటిక్ అభ్యర్థిగా కమల పేరు దాదాపు ఖరారవడంతో ప్రజల నుంచి ఆమెకు భారీగా మద్దతు లభిస్తున్నది. గురువారం రాత్రి కమలకు మద్దతుగా డెమోక్రటిక్ మహిళా కార్యకర్తలు జూమ్ వేదికగా విరాళాల సేకరణ నిర్వహించారు. గంటన్నరలోనే 1.64 లక్షల మంది మహిళలు పాల్గొన్నారు. ఏకంగా 2 మిలియన్ డాలర్లు (రూ.16కోట్లు పైమాటే)కు పైగా విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో ప్రముఖ సింగర్ పింక్, నటి కాన్ని బ్రిటన్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. తొలుత కరోల్ లీఫ్ 5 లక్షల డాలర్లను ప్రకటించగా.. ఆ వెంటనే విరాళాలు పోటెత్తాయి.