ఖమ్మం: విద్యార్థులు జుట్టు పెంచుకొని స్కూలుకు వస్తున్నారని ఆ టీచర్ శివాలెత్తిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా అలాగే వస్తున్నారని.. బార్బర్ అవతారమెత్తింది. స్వయంగా కత్తెర పట్టుకొని తానే విద్యార్థులకు జట్టు కట్ చేసింది. అంతా బాగానే ఉంది గానీ.. కట్ చేయడంలో ఆమె పైశాచికత్వం చూపించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిరీష అనే ఇంగ్లీష్ టీచర్.. బార్బర్ లా మారి 8 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించారు. కొందరు విద్యార్థులు జుట్టు పెంచి రోజు తరగతులకు హాజరవుతున్నారని,ఎన్నిసార్లు కటింగ్ చేయించుకుని స్కూల్ కి రావాలని హెచ్చరించిన మాట వినడం లేదని స్వయంగా టీచర్ శిరీష్ నే బార్బర్ అవతారమెత్తింది.
ఓ కత్తెర తీసుకొని తనకి వచ్చిన విధంగా 8 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించింది. తలపై అక్కడక్కడ జుట్టు కత్తిరించడంతో పేను కొరికినట్లు వికారంగా కనిపించింది. ఇది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు అవాక్కయ్యారు. పాఠశాల వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకొని ఆందోళన చేపట్టారు.
పాఠాలు చెప్పాల్సిన టీచర్మమ ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటీ.. అవమానంతో తమ పిల్లలు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యులు ఎవరంటూ ప్రశ్నించారు. అయితే టీచర్ చేసిన పనికి తమ పిల్లలకు పూర్తిగా గుండు కొట్టించాల్సి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.