ప్రాణం పోయినా పోరాటం ఆపను: బర్రెలక్క

ప్రాణం పోయినా పోరాటం ఆపను: బర్రెలక్క

కొల్లాపూర్/నాగర్​కర్నూల్​టౌన్, వెలుగు:  ప్రాణం పోయినా తన పోరాటం ఆపనని కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి శిరీష అలియాస్​ బర్రెలక్క స్పష్టం చేశారు. ప్రముఖ అడ్వకేట్లు కావేటి శ్రీనివాస్ రావు, కరణం రాజేశ్ గురువారం కొల్లాపూర్​లో శిరీషను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శిరీష మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నామినేషన్ వేసినప్పటి నుంచి రోజూ ఫోన్లు చేసి చంపుతామని బెదిరిస్తున్నారు. బయటకు చెప్పుకోలేని విధంగా బూతులు తిడుతున్నారు. నాకు సపోర్టుగా నిలబడినవారినీ బెదిరిస్తున్నారు.

కొందరి ఉద్యోగాలు తీసేయించారు. నిరుద్యోగుల వాయిస్​గా, లోకల్​ఇష్యూస్​ను హైలైట్ చేసేందుకు, పేదలకు మంచి చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నన్ను బెదిరించిన ప్రతి ఒక్కరి వివరాలు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఎన్నికల తర్వాత వెల్లడిస్తాను. నన్ను చంపినా వెనకడుగు వేయను. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు అందరితో కలిసి పోరాడుతాను’’ అని చెప్పారు. బర్రెలక్క తమ్ముడిపై దాడి చేయడం సిగ్గుచేటని అడ్వకేట్లు కావేటి శ్రీనివాస్ రావు, కరణం రాజేశ్ అన్నారు.

అంతర్జాతీయ న్యాయవాదుల సంఘం బర్రెలక్కకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థికి రక్షణ కల్పించాల్సిన ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. బర్రెలక్కను టచ్ చేయాలంటే, ముందు లాయర్లను టచ్ చే యాలని సవాల్ విసిరారు. దాడికి పాల్పడిన వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. శిరీష పోటీ చేయడంతో రాజకీయ పార్టీలకు మింగుడుపడటం లేదన్నారు. అనంతరం అడ్వకేట్లు, మద్దతుదారులు, సీనియర్​జర్నలిస్ట్​ పాశం యాదగిరితో కలిసి తనకు సెక్యూరిటీ కల్పించాలని అడిషనల్​ఎస్పీ రామేశ్వర్​కు శిరీష వినతి పత్రం ఇచ్చారు. 

భద్రత కల్పించాలని  హైకోర్టులో పిటిషన్

తన తమ్ముడిపై రెండ్రోజుల కింద దాడి జరిగిందని, తన ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో 2ప్లస్‌2 గన్‌మెన్లతో భద్రత కల్పించాలని కోరుతూ కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు హోంశాఖ ప్రధాన కార్యదర్శి, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టనున్నారు.