
నిర్మల్, వెలుగు: టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-1 పరీక్ష జనరల్ ర్యాంకింగ్‌లో నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ భార్య బరీరా ఫరీద్ రాష్ట్రస్థాయిలో 68వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్‌కు చెందిన షేక్ ఫరీరుద్దీన్, షమీన్ ఉన్నిసా కూతురు బరీరా ఫరీద్. ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టర్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీని పూర్తి చేసిన ఆమె.. సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యారు. 2022లో సివిల్స్ లో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. బరీరా ఫరీద్ తండ్రి భార-త వాయుసేనలో రిటైర్డ్ ఉద్యోగి. ఏడుగురు సంతానంలో ఆమె అందరికంటే చిన్నది. గ్రూప్ -1 ర్యాంకింగ్స్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆమెను పలువురు అభినందించారు.
డీఎస్పీగా ఎంపికైన ఎస్సై
బాసర: బాసర మండలంలోని కిర్గుల్ (బి) గ్రామానికి చెందిన కరండే మహేందర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తూనే గ్రూప్ 1 ఫలితాల్లో ప్రతిభ కనబరిచి డీఎస్పీగా ఎంపికయ్యారు. మహేందర్ ప్రస్తుతం గుడిహత్నూర్ ఎస్సైగా పనిచేస్తున్నారు. బాసర మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు జంగం రమేశ్, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్, మాజీ ఎంపీటీసీ శ్యామ్ సుందర్ తదితరులు ఆదివారం మహేందర్‌ను సన్మానించారు.