న్యూఢిల్లీ: కాఫీ స్టోర్ల చెయిన్ బరిస్తా రాబోయే రెండేళ్లలో భారీగా విస్తరించనుంది. ఇందుకోసం రూ.100 కోట్ల పెట్టుబడులను సమీకరించాలని భావిస్తోంది. 2025 నాటికి 500 స్టోర్లను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడులతో వచ్చిన మొత్తంతో కంపెనీ యాజమాన్యంలోని స్టోర్లను, ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయనుంది. 2000 లో ప్రారంభమైన బరిస్తా, మెట్రోలు, నాన్-మెట్రో నగరాలు సిటీ హైవేలలో విస్తరించాలని యోచిస్తోందని కంపెనీ సీఈఓ రజత్ అగర్వాల్ అన్నారు. మరో కాఫీ స్టోర్ టిమ్ హోర్టన్స్, ప్రెట్ ఎ మ్యాంగర్‌తో సహా గ్లోబల్ కంపెనీలు దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను పెంచుతున్నాయి. కెనడాకు చెందిన టిమ్ హోర్టన్స్ ఇటీవల ముంబైలో రెండు అవుట్‌లెట్‌లను ప్రారంభించింది.
టాటా యాజమాన్యంలోని స్టార్‌బక్స్ మెట్రో నగరాల వెలుపల తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. బరిస్తా ప్రస్తుతం శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్‌లతో కలిపి 362 అవుట్‌లెట్‌లను నిర్వహిస్తోంది. గత మూడేళ్లలో 150 అవుట్‌లెట్‌లను ప్రారంభించింది. వచ్చే ఐదు నుంచి ఆరు నెలల్లో దాదాపు 400కు పైగా అవుట్‌లెట్‌లు అందుబాటులోకి రానున్నాయి. రాబోయే ఏడాదిన్నర కాలంలో మరో 100 అవుట్‌లెట్‌లను ప్రారంభించనుంది.