పరీక్షలు సక్కగా నిర్వహించలేని ప్రభుత్వాలు ఎందుకు?: బర్రెలక్క

పరీక్షలు సక్కగా నిర్వహించలేని  ప్రభుత్వాలు ఎందుకు?: బర్రెలక్క

ఎన్నికల్లో పోటీ చేయాలనేది తన సొంత నిర్ణయమని బర్రెలక్క (శిరీష) తెలిపారు. ఆమె గురువారం ‘వెలుగు’తో మాట్లాడారు. ‘‘దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పోరాడుతున్నరు. అప్పులు చేసి కుటుంబాలకు భారంగా మారి హైదరాబాద్​ కోచింగ్​సెంటర్లలో ఉండి తిప్పలు పడుతున్నరు. వారి బాధలు చెప్పడానికి మాటలు సరిపోవు. ఈరోజు కాకుంటే రేపు లేదా ఎల్లుండైనా మంచిగుంటదనే నమ్మకం లేదు. ఒక్క పరీక్ష సక్రమంగా నిర్వహించారా? పరీక్షలు సక్కగా రాయకపోతే ఫెయిల్​చేస్తరు.

అసలు పరీక్షలే సక్కగా పెట్ట   లేని ప్రభుత్వాలను ఏం చేయాలి. ఎమ్మెల్యేలుగా గెలిస్తే మంత్రులుగా ప్రమోషన్​ఇస్తరు. లేకుంటే కార్పొరేషన్​ చైర్మన్​పదవులు ఇస్తరు. మరి నిరుద్యోగులు ఏజ్​బార్​అయ్యే వరకు పరీక్షలు రాయనీకే పోటీ పడుతున్నరు. ఉద్యోగాలు సంపాదించుకునేందుకు కాదు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు?” అని శిరీష ప్రశ్నించారు. 

మస్తు స్పందన వస్తున్నది.. 

తనకు జనం నుంచి మంచి స్పందన వస్తున్నదని శిరీష తెలిపారు. ‘‘నా దగ్గర డబ్బు లేదు. అందుకే చాలామంది చందాలు ఇస్తున్నారు. నేను పైసలు పంచను. మందు పొయ్యను. కానీ జనాలు వచ్చి, నేను చెప్పింది శ్రద్ధగా వింటున్నారు. ‘నువ్వు ఓడిపోతే మేము ఓడిపోయినట్టే’ అని అంటున్నారు. ప్రతి స్టేట్​నుంచి నిరుద్యోగ సోదరులు కూడా వచ్చి, నాకు సపోర్ట్​ చేస్తున్నారు. చాలామంది ఫోన్లు చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. నాకు మద్దతిచ్చారనే కోపంతో ఒకరిద్దరి ఉద్యోగాలు పోయేలా చేశారు. మాపై ఎందుకింత కక్ష. మేము వాళ్ల అధికారం, ఆస్తుల్లో వాటాలు అడుగుతలేం. బర్రెలక్క ఒక్కతే పోటీ చేస్తే ఏం జరగదు. ఇది నా ఒక్కదాని సమస్య కాదు. రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగుల సమస్య. మా నిరుద్యోగ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఎన్నికల్లో పోటీ చేయాలె. వాళ్ల ఇంటి నుంచే పోరాటం మొదలు కావాలె” అని పిలుపునిచ్చారు. 

నేనంటే ఎందుకంత భయం.. 

తాను పోటీ చేస్తే, వివిధ పార్టీల లీడర్లు ఎందుకంత భయపడుతున్నారని శిరీష ప్రశ్నించారు. ‘‘కొందరు నన్ను చంపుతానని బెదిరిస్తున్నరు. మా తమ్ముడిపై దాడి పక్కా ప్లాన్​ప్రకారం జరిగింది. పొలిటికల్ పార్టీల లీడర్లకు అంత భయం ఎందుకో అర్థమైతలేదు. నాలుగు బర్రెలు కాసుకునే శిరీషను చూసి ఎందుకు భయపడుతున్నరో చెప్పాలి” అని అన్నారు. ‘‘ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో చెప్పాలి. జాబ్​క్యాలెండర్​ఇవ్వాలి. పేపర్లు అమ్ముకోకుండా షెడ్యూల్​ప్రకారం పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎలక్షన్ల ముందు కుక్కలకు బొక్కలేసినట్లు మాకు ఆశచూపించుడు కాదు. మా ఉద్యోగాలు మాకు ఇయ్యాల్సిందే. ఇదే నా మేనిఫెస్టో” అని చెప్పారు.