చిన్నంబావి, వెలుగు: రాజకీయాల్లో మార్పు కోసం కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క (శిరీష)కు ఓటు వేసి గెలిపించాలని సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో బర్రెలక్కకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి వచ్చి, చట్టసభల్లో అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇలాంటి యువతకు అవకాశాలిచ్చి చట్ట సభల్లో కొత్త గొంతుక వినపడేలా అవకాశం కల్పించాలని, అందుకే తాను శిరీషకు మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చానని ఆయన తెలిపారు.
ఆమె ధైర్యసాహసాలు అందరికీ రోల్ మోడల్ అని పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో శిరీష ఇంతవరకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో శిరీష ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లి విజిల్‌తో ప్రజలను మేల్కొల్పాలని ఆయన కోరారు. శిరీషకు కేటాయించిన విజిల్ గుర్తుపై ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఆమెను అసెంబ్లీకి పంపిస్తే కొల్లాపూర్ సమస్యలపై అసెంబ్లీలో ఈల వేస్తుందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం కోసం దేశం మొత్తం అప్పుడు ఎలా కదిలిందో.. శిరీష విజయం కోసం ఇప్పుడు అందరం కృషి చేయాలని జేడీ పిలుపునిచ్చారు.