KKR vs PBKS: బాల్ పట్టుకొని బౌండరీకి విసిరాడు: ఆసీస్ క్రికెటర్‌పై నెట్టింట ట్రోల్స్

KKR vs PBKS: బాల్ పట్టుకొని బౌండరీకి విసిరాడు: ఆసీస్ క్రికెటర్‌పై నెట్టింట ట్రోల్స్

ఐపీఎల్ 2025 లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 15)  జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో వింత  సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ మారుతుంది. 112 పరుగుల స్వల్ప ఛేజింగ్ లో రహానే వికెట్ తీసి యుజ్వేంద్ర చాహల్ పంజాబ్ కు బ్రేక్ ఇచ్చాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన వెంకటేష్ అయ్యర్ తాను ఎదర్కొన్న రెండో బంతిని స్వీప్ షాట్ ఆడాడు. డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్-లెగ్‌లో  ఫీల్డింగ్ చేస్తున్న బార్ట్‌లెట్.. బంతిని పట్టుకున్నాడు. అయితే వెంటనే బాల్ విసిరేసే ప్రయత్నంలో బంతి చేతిలో నుంచి జారీ బౌండరీ అవతల పడింది. 

ఈ సంఘటనతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. క్రికెట్ లో చాలా సార్లు మిస్ ఫీల్డింగ్ చేయడం చూసాం కానీ ఒక ఫీల్డర్ అనుకోకుండా బంతిని బౌండరీకి విసరడం ఆశ్చర్యకరంగా అనిపించింది. 8 ఓవర్ నాలుగో బంతికి ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పటికే వెంకటేష్ సింగిల్ తిరగడంతో అంపైర్లు దీనిని ఓవర్ త్రో కింద పరిగణించి ఫోర్ తో పాటు సింగిల్ కూడా కలిపి మొత్తం కేకేఆర్ జట్టుకు ఐదు పరుగులు ఇచ్చారు. అసలే ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యం ఉంటే..బార్ట్‌లెట్ చేసిన పనికి పంజాబ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ఆసీస్ ఫాస్ట్ బౌలర్ పై సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. 

ఈ మ్యాచ్ లో మార్కస్ స్టోయినిస్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన బార్ట్‌లెట్.. 3 ఓవర్లలో 30 పరుగులిచ్చి డికాక్ వికెట్ పడగొట్టాడు.  ముల్లన్పూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 111 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ బౌలర్లు చూపించిన పోరాటం అద్భుతం. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. 112 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా 95 పరుగులకే ఆలౌట్ అయింది.