వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చి అందరి దృష్టి తమవైపు తిప్పుకున్న నెదర్లాండ్స్.. ప్రస్తుతం ఆస్ట్రేలియా మీద జరుగుతున్న మ్యాచ్ లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఆసీస్ బ్యాటర్ల ధాటికి డచ్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ముఖ్యంగా నెదర్లాండ్స్ ఆల్ రౌండర్ బేస్ డీ లీడ్ కు ఆసీస్ బ్యాటర్లు పీడకలనే మిగిలిచారు. ఈ క్రమంలో కంగారూల విధ్వంసానికి వన్డేలోనే అత్యంత చెత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
వరల్డ్ కప్ లో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో బేస్ డీ లీడ్ 10 ఓవర్లలో ఏకంగా 115 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో వన్డేల్లో ఒక బౌలర్ గా అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 113 పరుగులతో ఆసీస్ బౌలర్లు లూయిస్, జంపా ఉండగా తాజాగా ఈ చెత్త రికార్డును బ్రేక్ చేసాడు బేస్ డీ లీడ్. ఆసీస్ బ్యాటర్ మ్యాక్స్ వెల్ ధాటికి ఇన్నింగ్స్ 47 ఓవర్లో 15 పరుగులు సమర్పించుకున్న ఈ ఆల్ రౌండర్.. 49 ఓవర్లో ఏకంగా 28 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక మ్యాచు విషయానికి వస్తే మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మ్యాక్స్ వెల్(106), వార్నర్(104) సెంచరీలు చేయడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. స్మిత్(71), లబుషేన్(62) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో 13.2 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. కెప్టెన్ స్కాట్ ఏడ్వార్డ్స్ (2) తేజ నిడమానూరు (0) క్రీజ్ లో ఉన్నారు.