బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి భాను ప్రసాద్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గదిలో నుంచి దుర్వాసన వచ్చే వరకు సిబ్బంది మృతదేహాన్ని గుర్తించకపోవడంపై కుటుంబసభ్యులు, బంధువులు మండిపడుతున్నారు. మరోవైపు భాను ప్రసాద్ ఉరి వేసుకున్న గదిలో సూసైడ్ లెటర్ లభ్యమైంది. తన చావుకు ఎవరూ బాధ్యులుకారని, మానసిక సమస్యే తన నిర్ణయానికి కారణమని అందులో రాశాడు.
"నా చావుకు నేనే కారణం. గత ఏడాదిగా మానసిక క్షోభను అనుభవిస్తున్న. నా మానసిక సమస్యే నా చావుకు కారణం, ఏడాది నుండి మానసికంగా నరకయాతన పడుతున్న. అమ్మ అక్కని బాగా చూసుకో, నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యి. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో చదువుపై ఇంట్రెస్ట్ పోయింది. ఎన్నో సార్లు చనిపోవాలని అనుకున్న. నన్ను క్షమించు అమ్మ... అంటూ" బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ భాను ప్రసాద్ తన సూసైడ్ నోట్ లో రాసినట్టు పోలీసులు తెలిపారు.
భాను ప్రసాద్ సూసైడ్ లెటర్ లో చెప్పిన వ్యాఖ్యలపై అతని కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు చదవలేక ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అంటున్నారు. మూడునాల్రోజుల క్రితమే భాను ఆత్మహత్య చేసుకున్నా.. క్యాంపస్ అధికారులు ఎవరూ చెప్పలేదని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతరుల ద్వారా తమకు అర్థరాత్రి తెలిసిందని, క్యాంపస్ లో విద్యార్థి చనిపోయినా కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తున్నారు. మృతదేహం చూస్తే చాలా రోజుల క్రితమే మరణించినట్లు అనిపిస్తోందని, ఉస్మానియా డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.