బాసర చావులకు..బాధ్యతెవరిది

బాసర త్రిపుల్ ఐటీలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు.  అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థలో విద్యార్థుల వరుస బలవన్మరణాలు తెలంగాణ విద్యారంగ పరిస్థితికి అద్దంపడుతున్నాయి. మరో వైపు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర విద్యారంగ ఘనత చాటేందుకు విద్యా ప్రభుత్వం ఈనెల 20న విద్యా దినోత్సవం నిర్వహిస్తోంది. బాసరలో సావుపాట వినపడుతుంటే.. ప్రభుత్వం సంబురాలు చేస్తున్నది. గత ఏడాది జూన్, జులై మాసాల్లో వరుస ఆత్మహత్యలు జరగడంతో బాసరలో విద్యార్థుల నిరసన జ్వాలలు రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడించాయి. 

బాసర ట్రిపుల్ ఐటీ విద్యాకేంద్రంలో విద్యార్థులపై అధికారుల వేధింపులు పెరుగుతున్నాయని, ఈ ఏడాది అడ్మినిస్ట్రేటివ్ అధికారుల నియంతృత్వ ధోరణి మరింత పెరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాసరలో ఇటీవల ఫస్టియర్ విద్యార్థిని బూర నిఖిత నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందు మరో ఫస్టియర్ విద్యార్థిని దీపిక ఆత్మహత్యకు పాల్పడింది. మొదటి సంవత్సరం చదువుతున్న  విద్యార్థిని దీపిక వాష్ రూంలోని ఎగ్జాస్టర్ ఫ్యాన్ కు చున్నీ తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం ఉదయం జరిగిన పరీక్షలో దీపికపై మాల్ ప్రాక్టీస్ ఆరోపణ చేశారు. మాల్ ప్రాక్టీస్ నేరమైతే అందుకు విచారించాల్సింది ఎవరు? ఎక్కడ? అందుకు పనిష్ మెంట్ ఏ రూపంలో ఉంటుందనే విషయంలో బాసర అధికారుల వేధింపులు భగల్ పూర్ జైలును తలపిస్తున్నాయి. మాల్ ప్రాక్టీస్​ కేసులో విచారణకు క్యాంపస్ లోని పోలీస్ ఔట్ పోస్ట్ కు తీసుకు వెళ్లి, విచారణ పేరిట దీపిక ఫోన్ ఓపెన్ చేయించేందుకు అధికారులు యత్నించారు. ఫోన్ లో పర్సనల్ సమాచారం ఫొటోలు ఉన్నందున దీపిక ఫోన్ ఓపెన్ చేసేందుకు నిరాకరించింది. 

బాలిక విద్యార్థినుల విచారణలో మహిళా ఉద్యోగులు లేకపోవటం గమనించాల్సిన విషయం. వేధింపుల పర్వం ముదిరిన నేపథ్యంలో దీపికను పలువిధాల వేధించటం, ఆత్మాభిమానం దెబ్బతినేలా దూషించడం సమస్యను తీవ్రతరం చేసింది. దీపిక పోలీస్ ఔట్ పోస్ట్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా బలవంతంగా దీపికను చీఫ్ వార్డెన్ కార్యాలయానికి తరలించారు. అక్కడ మరింత తీవ్రమైన వేధింపులను తట్టుకోలేక అదే కార్యాలయం ఏబీ 3లోని వాష్ రూంలోకి వెళ్లి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు కొన ఊపిరితో ఉన్న దీపికను భైంసా హాస్పిటల్ కు తీసుకువెళ్లే క్రమంలో దీపిక మరణించింది.  

ఓవైపు హామీలు, మరోవైపు కేసులు

బాసర ట్రిపుల్​ఐటీలో ప్రతి చిన్న పొరబాటుకు, లేదా ప్రశ్నించిన విద్యార్థులను పోలీసు ఔట్ పోస్ట్ కు తీసుకువెళ్లి రోజుల తరబడి అక్కడే నిర్భంధించటం వంటి వేధింపులు పెరిగాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నోరు విప్పితే చాలు పోలీస్ ఔట్ పోస్ట్ లో ఖైదు చేయటం ప్రజాస్వామ్య విరుద్ధం కాదా? ఇది విద్యాక్షేత్రమా? జైలా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.  త్రిసభ్య కమిటీ ఏర్పాటులోనే లోపం ఉందని విమర్శిస్తున్నారు.  దీపిక  వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు చేయాల్సిన అవసరం, అధికారం అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు లేదని విద్యార్థులు ఆరోపించారు. క్యాంపస్ లో  కనీసం మాట్లాడుకునే హక్కు కూడా లేకుండా అడుగడుగునా అధికారులు నిఘాలు, వేలాది సంఖ్యలో పోలీసుల మోహరింపు, బెదిరింపులకు గురిచేస్తూ క్యాంపస్ లో విద్యార్థుల కనీస హక్కుల హననం సాగుతున్నదని విద్యార్థులు ఆరోపించారు. బాసర ట్రిపుల్ ఐటీ ప్రభుత్వ విద్యా కేంద్రమా! లేక ప్రైవేటు విద్యా కేంద్రమా! అనే అనుమానాలు 
వ్యక్తమవుతున్నాయి. 

బాసరలో కొనసాగుతున్న అధికారుల అప్రకటిత నిషేధాజ్ఞలపై విద్యార్థుల హక్కుల హననంపై, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి గత విద్యా సంవత్సరం జూన్ లో మొదలైన విద్యార్థుల ఉద్యమం ఎండా వానల్లో సైతం రాత్రి పగలు అనే తేడా లేకుండా శాంతియుత నిరసన ఉద్యమానికి  రాష్ట్రప్రభుత్వం దిగివచ్చింది. మంత్రి కేటీఆర్​ పలువురు మంత్రులు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తదితరులు బాసరకు వరుసలు కట్టారు. విద్యార్థులు పెట్టిన డిమాండ్ లపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రులు సబిత, కేటీఆర్​ లు ఒక వైపు హామీలు ఇస్తూ, విద్యార్థుల ఉద్యమాన్ని చల్లబరిచేందుకు చెమటోడ్చారు. మరో వైపు క్యాంపస్ నందు వేలాదిమంది పోలీసులతో నింపి ఉద్యమ బాధ్యులుగా గుర్తించిన విద్యార్థులపై క్రమశిక్షణ పేరిట కేసులు నమోదు చేయించి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. 

విద్యారంగంలోనూ ఆత్మహత్యలేనా?

ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉండే బాసర ట్రిపుల్​ఐటీ క్యాంపస్ లో ఆ మధ్య విద్యార్థులను పరస్పరం కలవకుండా పోలీసులు హాస్టల్ గదుల వద్ద మోహరించారు. శాంతియుతంగా సాగిన విద్యార్థుల నిరసన ఉద్యమాన్ని పోలీసులే పథకం ప్రకారం హింసాత్మకంగా మార్చేందుకు ప్రయత్నం చేశారు. పోలీసు వాహనాల అద్దాలు పగులగొట్టారనే కేసులో విద్యార్థి, ఉద్యమ ప్రతినిధులను పోలీస్ స్టేషన్ల పాలు చేశారు. బాసరలో ఆమూలాగ్రం అవినీతితో నిండిపోయిందని ప్రతి అవినీతిలో అధికార పక్షానికి చెందిన నాయకులే భాగస్వాములనీ, బాసరలో అధికారుల నియంతృత్వం నాయకుల పరోక్ష పెత్తనం నడుస్తుందనే విద్యార్థుల వాస్తవ ఆరోపణలు తెలంగాణ సమాజం గమనించాలి. 

గేట్ బయట వందలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు రోజుల తరబడి బైఠాయించినా వారిని లోపలికి అనుమతించలేదు.పైగా వారిని సామూహికంగా అరెస్ట్ చేసి జిల్లా కేంద్రానికి తరలించారు. గత విద్యాసంవత్సరం బాసరలో కల్లోలం రేకెత్తించిన వరుస ఆత్మహత్యలు ఈ విద్యాసంవత్సరం కూడా కొనసాగటం.. సాధించుకున్న తెలంగాణలో విద్యారంగం సిగ్గుతో తల దించుకునే స్థితి వచ్చింది. బాసర విద్యాక్షేత్రంలో అధికారులు విపరీతమైన గోప్యతను పాటించటానికి, క్యాంపస్ లోపల వరుస ఆత్మహత్యలకు గల సంబంధంపై సమగ్ర విచారణ జరిపించాలి. వరుస ఆత్మహత్యలపై సీబీఐతో విచారణ చేయించాలని విద్యార్థులు కోరుతున్నారు.

- అజయ్, వరంగల్​ జిల్లా  ఉపాధ్యక్షుడు, టీపీటీఎఫ్​