క్యూలైన్లు ఫుల్లు.. వసతులు నిల్లు

క్యూలైన్లు ఫుల్లు.. వసతులు నిల్లు

బాసర, వెలుగు : మూలనక్షత్రం సందర్భంగా బాసర ఆలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. పొరుగు రాష్ట్రాల భక్తులు కూడా రావడంతో ఆలయ పరిసరాలన్నీ జనంతో నిండిపోయాయి. కానీ, భక్తుల తాకిడికి అనుగుణంగా సరైన వసతులు కల్పించేందుడంలో అధికారులు దృష్టి సారించలేదు. అమ్మవారి దర్శనానికి భక్తులు సుమారు 4 గంటలపైనే క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. ఈక్రమంలో చిన్న పిల్లల ఏడ్పులు ఆలయంలో మిన్నంటాయి. అర్చకులు పంపిణీ చేసిన పాలు, బిస్కెట్లు, తాగునీరు అందరికీ అందలేదు. పూజా కార్యక్రమాలు ఆలస్యం అయ్యాయి. అక్షరబ్యాసం చేయడానికి మూడు గంటలు పట్టిందని పలువురు భక్తులు చెప్పారు. దీంతో అమ్మవారిని మొక్కుదాం అని వచ్చిన వారు, ఆలయ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. 

లాడ్జిలు దొరకలే..

మూలనక్షత్రం రోజుకు ఒక రోజు ముందుగానే భక్తులు బాసరకు చేరుకోవడంతో అతిథి గృహాలు, లాడ్జిలు ఫుల్​ అయ్యాయి. వసతి దొరకక చాలా మంది భక్తులు ఆరుబయటే పడుకున్నారు. వేకువ జామున గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పిల్లలకు అక్షరాభ్యాస పూజలు చేయించారు. ఉదయం నుంచే అక్షరభ్యాస, అభిషేక, ప్రసాదాల విక్రయ కౌంటర్లు ఓపెన్​ చేశారు. ఎస్పీ ప్రవీణ్​ కుమార్​, ఏఎస్పీ కిరణ్​ ఖారేల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అన్నదాన సత్రంలో నాందేడ్​కు చెందిన గాడిపుర జగదీశ్​ మహారాజ్​ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం కొనసాగించారు. మహారాష్ట్రతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు, దీక్షా పరులు పాదయాత్రగా వచ్చారు. క్యూలైన్లలో భక్తులు, చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు అసహానం వ్యక్తం చేశారు.

అమ్మవారికి పట్టువస్త్రాలు..

మూలనక్షత్రం పురస్కరించుకొని సరస్వతీ అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి దంపతులు, ముథోల్​ ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి, నిర్మల్​, నిజామాబాద్​ జడ్పీ చైర్మన్లు విజయలక్ష్మీ, దాదన్నగారి విఠల్​రావు, చైర్మన్​ శరత్​ పాఠక్​ పట్టు వస్త్రాలు సమర్పించారు.