అమ్మవారి చెంత అసౌకర్యాల చింత .. అభివృద్ధికి దూరంగా బాసర ఆలయం

అమ్మవారి చెంత అసౌకర్యాల చింత .. అభివృద్ధికి దూరంగా బాసర ఆలయం
  • కోట్ల ఇన్​కం ఉన్నా సౌకర్యాలు సున్నా
  • అపరిశుభ్రంగా ఆలయ పరిసరాలు
  • దుర్వాసన వల్ల ఇబ్బందుల్లో భక్తులు

బాసర, వెలుగు: నిర్మల్ జిల్లాలో చదువుల తల్లి సరస్వతి కొలువుదీరిన  బాసర క్షేత్రం సమస్యలతో సతమతమవుతోంది. ఏటా రూ.15 నుంచి రూ.20 కోట్ల ఆదాయం వస్తున్నా కనీస సౌలతులు కల్పించడంలో సర్కారు విఫలమవుతోంది. నిర్వహణ లేక ఆలయ పరిసరాలు అధ్వానంగా మారాయి. బాసర అమ్మవారి ముఖం ఉత్తర ద్వారం  వైపు ఉన్నందున ఆలయంలోకి ఉత్తర ద్వారం నుంచే రావాలని గతంలో పీఠాధిపతులు సలహా ఇచ్చారు. కానీ ఈ ద్వారం వైపు రహదారి అధ్వానంగా ఉంది. మురుగు చేరి అపరిశుభ్రంగా మారింది. దుర్వాసన వస్తుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్తున్నారు. అధికారుల కళ్ల ముందే కనిపిస్తున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

అన్నీ సమస్యలే.. 

నవరాత్రి ఉత్సవాలు, వసంత పంచమి, మూలా నక్షత్రం రోజుల్లో ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. కానీ ఆమేరకు వసతి లేక ఇబ్బందులు పడ్తున్నారు.  భక్తులు ఉండేందుకు గతంలో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్తగా నిర్మిస్తున్నారు. ఆ పనులు ఇంకా పూర్తికాలేదు. పలు ఆలయాల పేరుతో నిర్వహిస్తున్న అతిథి గృహాలను కేవలం వీఐపీలకే ఇస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు ప్రైవేట్ లాడ్జిలను ఆశ్రయించి నష్టపోతున్నారు.

భక్తుల సంఖ్యకు అనుగుణంగా అదనపు గదులు నిర్మించాలని కోరుతున్నా  అధికారులు ఆ దిశగా  చర్యలు తీసుకోవడం లేదు. ఇక క్యూ లైన్ లో నల్లాలు లేకపోవడంతో భక్తులకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు. ఆలయ పరిసరాల్లో నిర్మించిన మూడు సులబ్ కాంప్లెక్స్ లు ఎటూ సరిపోవడంలేదు. రద్దీ రోజుల్లో వీటి ముందు భక్తులు క్యూకడ్తున్నారు. దీనితోడు వాటి నిర్వహణ సరిగ్గా లేక కంపుకొడుతున్నాయి.  

రైల్వే స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని టెంపుల్​కు వెళ్లేందుకు గతంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఒక బస్సు ఏర్పాటుచేశారు. బాసరకు రైలు వచ్చే టైంకు అనుగుణంగా నడుస్తున్న ఈ బస్సు ద్వారా భక్తులను టెంపుల్​కు ఉచితంగా తీసుకెళ్తారు. పెరిగిన భక్తులకు ఇది సరిపోవడం లేదు. దీంతో భక్తులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.  కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్​ సర్కారైనా బాసరలో సమస్యలను పరిష్కరించాలని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా టెంపుల్​పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్​ వ్యక్తమవుతోంది.

అమలుకాని మాస్టర్​ ప్లాన్​

తెలంగాణ ఏర్పాటు తర్వాత  బాసరలోని సరస్వతి టెంపుల్​ను దర్శించుకునే వాళ్ల సంఖ్య పెరిగింది. పిల్లల అక్షరాభాస్యాలన్నీ ఇక్కడే జరుగుతుండడంతో ఏటా వేలల్లో ఉండే భక్తుల సంఖ్య లక్షలకు చేరింది. ఆదాయం కూడా అదే రేంజ్​లో వస్తోంది. కానీ పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​సర్కారు టెంపుల్​అభివృద్ధిని గాలికి వదిలేసింది. 2018లో బాసరకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ యాదాద్రి తరహాలో బాసర టెంపుల్​టౌన్​ను డెవలప్​చేస్తానని హామీ ఇచ్చారు. మాస్టర్​ ప్లాన్​ రూపొందించాలని, ఇందుకోసం తక్షణమే రూ.50 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నానని వెల్లడించారు. కర్ణాటకలోని శృంగేరి పీఠాధిపతులను రప్పించి ఆలయ పునర్నిర్మాణ ప్రణాళిక రూపొందించారు.  కానీ ఫండ్స్​ రిలీజ్​చేయకపోవడంతో అభివృద్ధి ఆగిపోయింది.