నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ 'బసవ తారకరామ క్రియేషన్స్'పేరుతో కొత్త మూవీ బ్యానర్ ను స్థాపించారు. శనివారం హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో దీన్ని నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. కొత్త మూవీ బ్యానర్ ను ఏర్పాటుచేసిన సోదరుడు జయకృష్ణకు అభినందనలు తెలిపారు. ‘‘ ఇది మా సొంత బ్యానర్ . మా అన్నదమ్ములందరి బ్యానర్. మా అమ్మానాన్న పేర్లు కలిసొచ్చేలా 'బసవతారకరామ'అని మూవీ బ్యానర్ కు పేరు పెట్టినందుకు సంతోషంగా ఉంది. ఈ బ్యానర్ ద్వారా నిర్మించనున్న తొలి సినిమాలో జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయం కానుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మా నాన్నగారికి చైతన్య కృష్ణ చాలా ఇష్టమైన మనవడు.అతడు ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.చాలా వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళకు నా బెస్ట్ విషెస్. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు. ‘‘ మా తమ్ముడు బాలకృష్ణ ఈ బ్యానర్ ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. తొలి సినిమాలో మా అబ్బాయి చైతన్య కృష్ణను హీరోగా పరిచయం చేస్తున్నాను.ఈ చిత్రం టైటిల్, మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం’’ అని నిర్మాత నందమూరి జయకృష్ణ ఈసందర్భంగా తెలిపారు . ‘‘నాన్నగారు స్థాపించిన బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ ని బాబాయ్ బాలకృష్ణ లాంచ్ చేయడం,ఆశీస్సులు అందించడం చాలా ఆనందంగా ఉంది’’ అని హీరో చైతన్య కృష్ణ అన్నారు.
మరిన్ని వార్తలు..