కర్రె గుట్టలపై బేస్‌‌‌‌ క్యాంప్..గుట్టలను ఆధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా కదులుతున్న కేంద్ర బలగాలు

కర్రె గుట్టలపై బేస్‌‌‌‌ క్యాంప్..గుట్టలను ఆధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా కదులుతున్న కేంద్ర బలగాలు
  • గుట్టలను ఆధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా కదులుతున్న కేంద్ర బలగాలు
  • మూడు రోజులుగా కొనసాగుతున్న కాల్పులు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/వెంకటాపురం, వెలుగు : రాష్ట్ర సరిహద్దులోని కర్రె గుట్టలపై పోలీస్‌‌‌‌ బేస్‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసే దిశగా కేంద్ర బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఆపరేషన్‌‌‌‌ కగార్‌‌‌‌లో భాగంగా తెలంగాణ ‒ చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ గుట్టలను పూర్తిగా తమ కంట్రోల్‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చుకోవడమే సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌ దళాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

అంతర్రాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు డీఆర్‌‌‌‌జీ, ఎస్‌‌‌‌టీఎఫ్, కోబ్రా, బస్తర్‌‌‌‌ ఫైటర్స్, సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ సంయుక్తంగా మూడు రోజుల కింద ఆపరేషన్‌‌‌‌ మొదలుపెట్టాయి.మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మా దళానికి చెందిన ముగ్గురు మావోయిస్టులు ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో చనిపోయినట్లుగా బస్తర్‌‌‌‌‌‌‌‌ ఐజీ సుందర్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌ గురువారం ప్రకటించారు. కర్రె గుట్టలపై పోలీసుల ఆపరేషన్‌‌‌‌ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. 

దండకారణ్యం నుంచి కర్రె గుట్టల వైపు

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మావోయిస్ట్‌‌‌‌ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌ బలగాలు ఆపరేషన్‌‌‌‌ మొదలుపెట్టాయి. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని అబూజ్‌‌‌‌మడ్‌‌‌‌ పరిధిలోని ఆదివాసీగూడెలకు రోడ్డు వేసుకుంటూ ఆపరేషన్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేసిన సీఆర్పీఎఫ్‌‌‌‌ బలగాలు.. ప్రస్తుతం కర్రె గుట్టల వద్దకు చేరుకున్నాయి. సీఆర్పీఎఫ్ బలగాలు అబూజ్‌‌‌‌మఢ్‌‌‌‌ను స్వాధీనం చేసుకోవడంతో మావోయిస్టులు కర్రె గుట్టలను సేఫ్టీ ప్లేస్‌‌‌‌గా భావించి భారీ మొత్తంలో ఆయుధాలు తీసుకొని ఇక్కడికి వచ్చి ఉంటారని తెలుస్తోంది. మావోయిస్ట్‌‌‌‌ పార్టీ కీలక నేతలు మడవి హిడ్మా, దేవా దళాలు ఈ గుట్టపై డెన్‌‌‌‌ ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం అందుకున్న కేంద్ర బలగాలు స్పెషల్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌కు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా మూడు వైపుల నుంచి గుట్టను చుట్టుముట్టాయి. వీరికి సహకారంగా హెలికాప్టర్లు, డ్రోన్లు కూడా పనిచేస్తున్నాయి. పోలీస్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు, సిబ్బంది, గిరిజన ప్రజలను సైతం కర్రె గుట్టల వైపు రావద్దంటూ సీఆర్పీఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చే వరకు తాము ఎంటర్‌‌‌‌‌‌‌‌ అయ్యే పరిస్థితి లేదని లోకల్‌‌‌‌‌‌‌‌ పోలీసులు చెబుతున్నారు. 

మావోయిస్ట్‌‌‌‌ షెల్టర్‌‌‌‌ జోన్‌‌‌‌గా కర్రెగుట్టలు

ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామం నుంచి భద్రాద్రి జిల్లా చర్ల మండలం వరకు, వాజేడు మండలం ఉసూరు నుంచి చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రం వైపు 80 కిలోమీటర్ల పొడవు, 40 కిలోమీటర్ల వెడల్పుతో సుమారు 3 వేలకు పైగా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కర్రె గుట్టలు ఉన్నాయి. ఇక్కడ భారీ వృక్షాలు, పెద్ద బండ రాళ్లతో పాటు సహజ సిద్ధమైన గుహలు ఉంటాయి. గుట్టల కింద బంకర్లు, సొరంగ మార్గాలు ఉన్నాయి. ఒక్కో బంకర్ చాలా విశాలంగా ఉంటుందని, ఈ ప్రాంతంలో సెలయేళ్లు కూడా ప్రవహిస్తూ ఉంటాయని, నీటి ఊటలు వచ్చే చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ గుట్టల్లో నిటారుగా ఉన్న రాళ్ల మీద నడక కష్టం. అందుకే మావోయిస్టులు ఈ గుట్టలను షెల్టర్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌గా ఉపయోగిస్తూ వస్తున్నారు. మావోయిస్ట్‌‌‌‌  ప్రాబల్యం ఎక్కువగా ఉన్న అబూజ్‌‌‌‌మఢ్‌‌‌‌ ఏరియాలో పోలీసుల కూంబింగ్‌‌‌‌‌‌‌‌ జరిగితే వెంటనే మావోయిస్టు దళాలు తమకు పట్టున్న కర్రె గుట్టల వైపు వస్తుంటాయి. 

హిడ్మా దళానికి చెందిన ముగ్గురు ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌ : బస్తర్‌‌‌‌ ఐజీ సుందర్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌

కర్రె గుట్టల్లో జరిగిన పోలీస్‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌లో హిడ్మా దళానికి చెందిన ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని బస్తర్‌‌‌‌‌‌‌‌ ఐజీ సుందర్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ గురువారం ప్రకటించారు. ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో చాలా మంది గాయపడే అవకాశం ఉందని, హిడ్మా నేతృత్వం వహించే బెటాలియన్‌‌‌‌ నంబర్ 1కి చెందిన మావోయిస్ట్‌‌‌‌లకు వ్యతిరేకంగా క్రాస్‌‌‌‌ బోర్డర్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌ జరుగుతోందన్నారు. ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌ జరిగిన స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోయిస్టుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో ముగ్గురు మహిళా మావోయిస్టుల డెడ్‌‌‌‌బాడీలతో పాటు ఆయుధాలు దొరికాయని, చనిపోయిన వారు పీఎల్‌‌‌‌జీఏ బెటాలియన్‌‌‌‌ 1కి చెందినవారని ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు.

  • రాష్ట్ర పోలీసుల ప్రమేయం లేదు
  • ఆపరేషన్‌‌‌‌లో పాల్గొంటున్నది చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌ బలగాలే..
  •  మల్టీ జోన్‌‌‌‌ 1 ఐజీ చంద్రశేఖర్‍రెడ్డి
  • 14 మంది మావోయిస్టుల లొంగుబాటు

వరంగల్‍, వెలుగు : కర్రెగుట్ట కేంద్రంగా మూడు రోజులుగా సాగుతున్న ఆపరేషన్‌‌‌‌లో రాష్ట్ర పోలీసుల ప్రమేయం లేదని మల్టీ జోన్‌‌‌‌ 1 ఐజీ ఎస్‍.చంద్రశేఖర్‍రెడ్డి తెలిపారు. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ పోలీసులు, సీఆర్‍పీఎఫ్‍ బలగాలు మాత్రమే ఈ ఆపరేషన్‌‌‌‌లో పాల్గొంటున్నాయని చెప్పారు. గురువారం వరంగల్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌లో ఐజీ చంద్రశేఖర్‍రెడ్డితో పాటు వరంగల్‍ సీపీ సన్‍ప్రీత్‍ సింగ్‍, ములుగు ఎస్పీ శబరీష్‍, భూపాలపల్లి ఎస్పీ కిరణ్‌‌‌‌ ఖరే, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌‌‌‌రాజ్‌‌‌‌ సమక్షంలో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 

ఇందులో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు కాగా ఏడుగురు పార్టీ సభ్యులు, ఒక మిలీషియా కమాండర్‌‌‌‌, నలుగురు మిలీషియా సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ లొంగిపోయిన వారిలో ఒకరు తెలంగాణకు చెందినవారు కాగా, మిగతా 13 మంది చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ చెందిన వారేనన్నారు. లొంగిపోయిన వారిలో మడవి అంద, సోడి కోసి, మరకం హిడుమే, జడకం జోగి, పోడియం భూమిక, సోడి బుద్రి, మడవి పూజే, హేమ్లా సోను, సోడి రమేశ్‍, అట్టం బుద్ర, కోవాసి ఇడుమ, కోర్సా లాలు, హేమ్లా సుక్కు, కోర్సా సుక్కు ఉన్నారన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 253 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఐజీ వెల్లడించారు.