డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. అంటూ వినూత్నంగా ప్రచారం చేసి అందరికీ దగ్గరైన కల్యాణ్ జ్యువెల్లర్స్ కంపెనీలో ఫ్రాడ్ జరిగిందా..? స్టాక్ మార్కెట్ లో కంపెనీ షేర్లను పెంచేందుకు అక్రమ మార్గాలను అనుసరించారా? ఇవే సందేహాలతో ఈ మధ్య కల్యాణ్ జ్యువెల్లర్స్ షేర్లు భారీ పతనానికి గురయ్యాయి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ అద్భుతంగా వచ్చినప్పటికీ వరుసగా స్టాక్ ఫాల్ అవుతూ దాదాపు 40 శాతం పడిపోయింది.
కల్యాణ్ జ్యువెల్లర్స్ షేర్లను పెంచేందుకు మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ ఫండ్ మేనేజర్లు ఫ్రాడ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. డబ్బులు తీసుకుని కంపెనీ షేర్లను అమాంతం పెంచేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పరస్పర లాభం పొందారని మార్కెట్లో చర్చలు నడిచాయి. దీంతో కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి.
Also Read:-హైదరాబాద్‌లో మరో మలబార్ షోరూమ్ ఓపెన్..
కంపెనీపై వస్తున్న ఆరోపణలపై యాజమాన్యం స్పందించింది. తమ కంపెనీ షేర్లను పెంచేందుకు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ షేర్ల పతనం ఆగలేదు. కేవలం రెండు వారాలలోనే రూ.27,400 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది.
ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు: మోతీలాల్ ఓస్వాల్
ప్రముఖ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ ఈ ఆరోపణలపై స్పందించింది. తమ కంపెనీ నిజాయితీగా గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తోందని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రకటన ద్వారా తెలిపింది. విలువలతో కూడిన వ్యాపారం చేస్తున్నామని, తమ కంపెనీ ఫండ్ మేనేజర్లు ఎలాంటి తప్పు చేయలేదని తెలిపింది. తమ కంపెనీ రెప్యూటేషన్ ను దెబ్బ తీసేందుకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, కల్యాణ్ జ్యువెల్లర్స్ షేర్ పెంచేందుకు ఎలాంటి అవినీతి చేయలేదని వివరణ ఇచ్చింది.
మోతీలాల్ ఓస్వాల్ ప్రకటన తర్వాత కల్యాణ్ జ్యువెల్లర్స్ షేర్లలో కదలిక వచ్చింది. క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత కంపెనీ షేర్లు సోమవారం (జనవరి 20) పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి.