ఆఫీసర్లు, సొసైటీ చైర్మన్లు కలిసి రైతులను ముంచిన్రు

  • అధికారుల విచారణ లో వెలుగులోకి  అక్రమాలు
  • గుర్రంపోడు, నాంపల్లి, మర్రిగూడలో వడ్ల పైసల్లో భారీ కోత
  • ఒక్క గుర్రంపోడు పరిధిలోనే రూ.18 లక్షల నష్టం 
  • బోగస్ సెంటర్లు నడిపించిన ఆఫీసర్లు

నల్గొండ, వెలుగు : జిల్లాలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్​లు) రైతులను నట్టేట ముంచాయి. యాసంగి వడ్ల కొనుగోళ్ల వ్యవహారంలో సొసైటీ అధికారులు, చైర్మన్​లు కలిసి రైతులను మోసం చేశారు. రైతులకు చెప్పకుండా ఇష్టంవచ్చినట్లు తరుగు పేరుతో భారీ కోత పెట్టారు.  పర్మి షన్​ లేకుండానే బోగస్​ సెంటర్లు ఓపెన్​ చేసి రైతులకు టోపీ పెట్టారు. రైతులకు ట్రక్​షీట్లు ఇవ్వకుండా మిల్లర్లకు ట్రక్​షీట్లు ఇచ్చిన సిబ్బంది, క్వింటాకు నాలుగైదు కిలోల చొప్పున కోత పెట్టినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.  

రైతులను మోసం చేశారు ఇలా...

గుర్రంపోడు, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లోని పీఏసీఎస్​సెంటర్ల వడ్ల కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారుల విచారణలో తేలింది. వడ్లు నాణ్యంగా లేవని మిల్లర్లు దింపుకోట్లేదని రైతులను మోసం చేశారు. గుర్రంపోడు పీఏసీఎస్​ పరిధిలోని పోచంపల్లి, చామలోనిబావి, కొప్పోలు సెంటర్లలో పీఏసీఎస్​ సిబ్బంది, మిల్లర్లు కుమ్మకై ఆడిన డ్రామాలో రైతులు భారీగా నష్టపోయారు.  రైతుల నుంచి కొన్న వడ్లకు రశీదులు ఇవ్వలేదు. అయితే మిల్లర్లకు మాత్రం రైతుల పేర్లతో ట్రక్​ షీట్లు ఇచ్చారు.  మిల్లులకు వడ్లు తరలించే క్రమంలో సిబ్బంది కొత్త డ్రామాకు తెరలేపారు. వడ్లు రంగు మారాయనే కారణాలతో మిల్లర్లు దిగుమతి​ చేసుకోవడం లేదని  క్వింటాకు రెండు, మూడు కిలోల చొప్పున కోత పెట్టారు. సిబ్బంది నిర్వాహకంతో ఈ మూడు సెంటర్ల పరిధిలో వెయ్యి క్వింటాళ్ల వడ్లను రైతులు నష్టపోయారు. వీటి విలువ సుమారు రూ.18 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. పర్మిషన్​ లేకుండానే పోచంపల్లి సెంటర్​ పరిధిలో  బోగస్ సబ్ సెంటర్​ ఓపెన్​ చేసి సుమారు 12 లారీల వడ్లు కొన్నట్లు గుర్తించారు.  

నాంపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్​ సెంటర్​లో, మర్రిగూడ పీఏసీఎస్​ పరిధిలో శివన్నగూడెం, ఎర్రగండ్లపల్లి, మర్రిగూడ, చండూరు పీఏసీఎస్​ సెంటర్లలో క్వింటాకు పది, పదిహేను కిలోల వడ్లను తరుగు పేరుతో కోత పెట్టారు.  ఒక్కో సెంటర్​లో రైతులు రూ.3‌‌‌‌నుంచి రూ.50 లక్ష ల వరకు నష్టపోయారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రెండు రోజుల క్రితం మర్రిగూడ సెంటర్​ ఇన్​చార్జి శివసాయికుమార్​ను అధికారులు సస్పెండ్​ చేశారు. మర్రిగూడ చైర్మన్, సెక్రటరీలకు మాత్రం షోకాజ్ నో టీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 

సెంటర్ ఇన్​చార్జిలను అడ్డం పెట్టుకుని...

సొసైటీలో సీఈఓ, సిబ్బందితోపాటు, ప్రతి సెంటర్​కు ప్రైవేట్​గా ఒక ఇన్​చార్జిని పెట్టారు. నెలకు రూ.10వేల జీతం ఇచ్చి  కొనుగోళ్ల నిర్వహణ అప్పగించి పీఏసీఎస్ అధికారులుచేతులు దులుపు కున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగిందని చెపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు కొనుగోలు చేస్తే కేవలం ఈ మూడు మండలాల్లో మాత్రమే అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఐకేపీ, పీఏపీఎస్​ పరిధిలోని చాలా సెంటర్లలో తరుగు పేరుతో రైతులు నష్టపో యారు. కానీ రైతులకు ఏదోరకంగా నచ్చచెప్పుకోవడంతోనే తరుగు దోపిడీ గుట్టు బయటపడలేదు. యాసంగి చివరి దశలో 8 నుంచి 12 సార్లు అకాల వర్షాలు పడ్డాయి. తడిసిన వడ్లను కొనడం ఇష్టం లేని మిల్లర్లు దిగుమతి చేసుకోకుండా రకరకాల కొర్రీలు పెట్టారు. ఈ క్రమంలోనే సెంటర్ల నిర్వహకులు, మిల్లర్లు కలిసి హైడ్రామా నడిపించారు. 

కానీ మిల్లర్ల పైన చర్యలు తీసుకునేందుకు అధికారికంగా ఎలాంటి రుజువులు లేకపోవడంతో పీఏసీఎస్​ సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. రైతుల పేరు మీద ట్రక్​షీట్లు ఇవ్వడంతో  సిబ్బంది విచారణలో సులువుగా దొరికి పోయారు. ఇంకోవైపు   అమ్మిన వడ్ల గురించి రైతులు పెద్దగా పట్టించుకోకపోవడం కూడా తరుగు దోపిడీకి దారితీసింది.