క్రీ.శ.712లో హైందవ ధర్మంపై మొదటి దాడి భారత దేశంలో మహ్మద్ బిన్ ఖాసి రూపంలో జరిగింది. అప్పటి నుంచి 1992 దాకా హిందూ సమాజంలో ఓ నిస్తేజం, దౌర్బల్యం. మొదటిసారి ‘రాముడు’ ఈ దేశంలో ‘ఆధ్యాత్మిక జాతీయవాదం’కు నాయకుడయ్యాడు. దేశం నలుమూలలా రామశక్తి ప్రకటితమైంది. వాల్మీకి భాషలో రాముడు ధర్మస్వరూపం, తులసీదాసు భాషలో రాముడు భక్తి సులభుడు. యోగుల మనసులో రాముడు తారక పరబ్రహ్మం. ఆఖరుకు మనల్ని పరమ శత్రువులుగా భావించే పాకిస్తాన్ ప్రజల గొప్ప కవి అల్లామా ఇక్బాల్ దృష్టిలో రాముడు ‘ఇమామ్ఎ హింద్’ రాముడు ‘భారత ఆధ్యాత్మిక నాయకుడు’.
ఈ దేశంలో ముక్కలు చెక్కలుగా ఉన్న హైందవ సమాజాన్ని రాముడు ఒక్కటి చేశాడు. ఎందుకంటే ఆయన వాల్మీకి చెప్పిన ‘ధర్మస్వరూపం’ కాబట్టి. ఆ ధర్మం దేశాన్ని, సంస్కృతిని, సనాతనాన్ని నిలబెట్టింది. అలాగే సామాన్య హైందవ భక్తులకు కూడా రాముడు తులసీదాస్ చెప్పినట్లు భక్తసులభుడు. గుహుడు, శబరి గుండెల్లో గుడిగా మారాడు. ఇప్పుడు ‘రామఅక్షతలు’ గ్రామాలకు చేరుతుంటే జనం శిగెం (పూనకం)తో ఊగుతున్నారు. ప్రతి మనిషీ గ్రామాల్లో కులాలను, పార్టీలను పక్కనపెట్టి రామ అక్షతలను తలపై మోస్తున్నాడు. కొన్నిచోట్ల ఇతర మతస్థులు కూడా వాటిని అడిగి తీసుకోవడం ఆశ్చర్యం. ఆనందమే కదా!
వివాదాలనూ ఛేదించే రామ నామం
కొంతమంది పరిశోధకులు ‘రాముడు దేవుడు కాదు’ అంటారు. సరే. ఇంకేంటి ‘గొప్ప మానవుడు’ అని ఒప్పుకున్నట్లేనా? నిశ్శబ్దం. రామాయణం జరగలేదని వాదించేవారు ‘సీతను రాముడు అడవికి పంపాడు’ అంటూ బురద జల్లుతారు. ఉత్తరకాండలో ‘ఉత్త కథ’ను చూపించి శంభూకుడిని ముందుపెట్టి శిఖండులయిపోతారు. సీతను అడవికి పంపిన రాముడు గురించి మీ అభిప్రాయం చెప్పండని వాజ్‌పేయ్‌ను అడిగితే ‘సీతారాముడిగా అది తప్పు. రాజా రాముడిగా అది కరెక్ట్’ అని తెలివిగా జవాబిచ్చారు.
ఇదంతా రామాయణ కావ్యమంత చర్చ. ఇప్పుడు ‘రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ’పై శంకరాచార్యుల సున్నిత నిరసనపై రచ్చ. తాజా వివాదం. అందులో కూడా రెండు ఓట్లు అటూ.. మరో రెండు ఓట్లు ఇటూ. కార్యక్రమం ఎలా జరగనుందో ‘శ్రీమాన్ చంపత్‌రాయ్’ ఓ సరైన వివరణ ఇస్తే సరిపోయేది. ప్రధాని మోదీ ‘ప్రాణ ప్రతిష్ఠ’ మంత్రాలు చదవరు కదా. మన ఇళ్లల్లో పూజలు, వ్రతాలు జరిగితే ఎవరు చేయిస్తారు? ఇంత పరిజ్ఞానం ఉంటే డిగ్గీ, ఖర్గే వివాదాన్ని లేవనెత్తరు. ‘యజమాన స్థానం’లో అధికార స్థానంలో ఉన్నవారు కూర్చుంటే తప్పేంటి? అయితే పీఠాధిపతులకు గౌరవ స్థానం ఇవ్వాల్సిందే. ఇది కూడా విస్మరించరానిదే. అయినా ఇదేం మోదీ పట్టాభిషేకం కాదు. రామవిగ్రహ ప్రాణ ప్రతిష్ఠ.
రాముడు ధర్మోద్ధారకుడు
ఓ చక్రవర్తి కుమారుడిగా రాముడు అనుకుంటే నేరుగా రావణుడిపై యుద్ధం చేయడానికి లంకకు వెళ్లవచ్చు. కానీ, రాముడి ఉద్దేశం అది కాదు. రాముడి ప్రయాణమే రామాయణం. ఉత్తర–దక్షిణ భారత భూభాగ ప్రజలను సాంస్కృతికంగా రాముడు ఏకం చేయగలిగాడు. ఆయన ప్రయాణం అయోధ్య నుంచి మొదలైంది. కానీ మిథిల (జనకపురి) నుంచి సీతాదేవిని పెండ్లి చేసుకున్నాడు. అటునుంచే మలేసియా, బాలి, ఇండోనేసియా, థాయ్‌లాండ్ వరకు ‘రామాయణ సంస్కృతి’ పరివ్యాప్తి చెందింది. శ్రీరాముడు విశ్వామిత్రుడు వెంట విద్యాభ్యాసానికి వెళ్లి మారీచుడిని తరిమేశాడు. తాటకి, సుబాహులను వధించాడు. ఆనాటి అరణ్యాలు మేధోమథన నిలయాలు. రుషులు విశ్వశాంతి కోసం చేసే ఆలోచనలు, తపస్సు, అంతా అరణ్యాల్లోనే జరిగేది. అక్కడ బలవంతులైన ‘సంఘవ్యతిరేక శక్తులు’గా ఈ రాక్షసులే ఉన్నారు.
విధ్వంసాన్ని అరికట్టాడు
విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేయాలనుకున్న రుషి. ఆయన పరిశోధనలకు భంగం కలిగించడం అంటే యజ్ఞ ధ్వంసం. యజ్ఞం అంటే నిజమైన వైదిక అర్థం త్యాగం. భౌతిక శక్తుల వశీకరణకు చేసే భాగం. మరోవైపు విశ్వరక్షణకు చేసే జ్ఞానయజ్ఞం. ఈ విధ్వంసాన్ని విశ్వామిత్రుడి సలహాతో అరికట్టి రాముడు యవ్వనంలోనే ‘విశ్వశాంతి’ ప్రాధాన్యత తెలుసుకోగలిగాడు. ఆ తర్వాత రాముడు అనివార్యంగా అడవికి వెళ్లాల్సి వచ్చింది. మొదటిరోజే గుహుడిని కలుసుకున్నాడు. చక్రవర్తి కుమారుడు, ఓ నిషాదుడు ఇద్దరి చర్చాగోష్టి అది.
అడవుల్లోని బాధలు మొదట గుహుడిని చూసే రాముడు గ్రహిస్తాడు. అక్కడ ‘కుల సమానత్వం’ అనే భావనకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత శబరిని మతంగ మహర్షి ఆశ్రమంలో కలుసుకుంటాడు. గిరిజన తపస్విని శబరి ఆతిథ్యం స్వీకరించాడు. ఈ మతంగ మహర్షి కూడా గొప్ప తపస్వి. శపించగల శక్తిగల యోగి. మతంగుడు ఈనాడు మన సమాజంలో చెప్పే దళిత వర్గాలకు చెందినవాడు. అలాగే అత్రి, భరద్వాజుల వంటి రుషుల ఆశ్రమాల సందర్శన ఆనాటి ‘వైదిక విద్య’ల పరిరక్షణకే. ఈ దేశ సంస్కృతి గొప్పతనం ప్రపంచ యవనికపై నిలబడిందంటే అది వేదమూలం కాబట్టి.
అందరికీ న్యాయం అందించాడు
సుగ్రీవుడి భార్యను అన్యాయంగా వాలి ఆక్రమణ విషయం కిష్కింధకు వెళ్లి తెలుసుకున్న రాముడు వాలిని చంపేస్తానని శపథం చేశాడు. అప్పటికే ఆయన సీతావియోగ దు:ఖంలో ఉన్నాడు. కాబట్టి ఈ అన్యాయం సహించలేకపోయాడు. వానరజాతి ఆటవిక జాతి. విశేష లక్షణాలు గల వానరులు. బలం ఎవరికి ఉంటే వాళ్లు ఇతరుల స్ర్తీలను లొంగదీసుకోవడం అనే కుసంస్కృతికి రాముడు చరమగీతం పాడాలని అనుకున్నాడు. అంతేగాకుండా కిష్కింధకే పరిమితం అయిన వానరులను సైన్యంగా మార్చాడు.
వాళ్లకున్న చాంచల్యం, చపలత్వం తగ్గించి వారియర్స్ గా మార్చాడు. అంతేకాకుండా వాల్మీకి రామాయణంలో సుగ్రీవుడు వర్ణించిన ‘జాగ్రఫీ’ చాలా అద్భుతంగా ఉంది. ఈ వానర సైన్యానికి హనుమ నాయకుడు. అంగద, జాంబవంత, నల, నీల మొదలైన వీరులతో అఖండ, అజేయకీర్తిగల రావణుడిపై యుద్ధానికి వెళ్లాడు. మన సమాజంలో బలవంతుల తప్పులను అందరూ చూస్తుంటారు. ఎదిరించేందుకు భయపడతారు. అడవిలో కాళ్లకు చెప్పులు కూడా లేని వ్యక్తి శ్రీరాముడు. వ్యవస్థను, సత్యాన్ని నమ్ముకొని చేసిన ఈ ఉద్యమం బలహీనులందరికీ ఆదర్శం.
దుర్మార్గపు వ్యవస్థపై తిరగబడాలి అని 8వేల ఏండ్లనాడే ఈ జాతికి బోధించిన శ్రీరాముడు ఈ జాతికి ఆరాధ్యుడు అయ్యాడు. జటాయువు, సంపాతి లాంటి పక్షి జాతి నాయకుల పట్ల శ్రీరాముడు ఆదరణ చూపాడు. వ్యవస్థను తన కాళ్ల కింద పెట్టుకొనే రావణబ్రహ్మపై తిరగబడ్డాడు. కిష్కింధను సుగ్రీవ, అంగదులకు, లంకను విభీషణుడికిచ్చి పట్టాభిషేకం చేసి తన త్యాగనిరతిని చాటుకున్నాడు. హనుమ వంటి బుద్ధిమంతుడిని తన ముఖ్య అనుచరుడిగా మార్చి సేవకు, త్యాగానికి, ధర్మానికి ప్రతీకగా నిలబెట్టాడు.
రామ జన్మభూమి ఉద్యమం
సుమారు వెయ్యేళ్ల బానిసత్వంలో 30వేల పైచిలుకు దేవాలయాలు ధ్వంసమైన భారత్‌లో, హిందువుల పరిస్థితి స్వాతంత్ర్యంవచ్చేనాటికి దీనంగా మారింది. హిందూత్వలోనే నిజమైన సెక్యులరిజం ఉందన్న విషయం విస్మరించిన వామపక్షా మేధోవర్గం. అదే గొప్పదనుకునే రాజకీయవర్గం హిందువుల పట్ల అవలంబించిన వైఖరి రామమందిరం ఉద్యమంగా బయటకు వచ్చింది. సోమనాథ్ నుంచి అయోధ్య వరకు అద్వానీ చేపట్టిన రథయాత్ర దేశంలోని హిందూ సమాజాన్ని ఏకం చేసింది.
పాండవులు ఐదుగురికి అయిదు ఊళ్లు ఇవ్వమని అడిగినట్లు హిందువులు ఈ సెక్యులర్ ప్రభుత్వం దగ్గర మొత్తుకున్నారు. కానీ, ఈ దేశ సాంస్కృతిక అస్తిత్వం అర్థం చేసుకోకుండా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, లాలూ, ములాయం వంటి వాళ్లు నిరాకరించారు. మన దేశంలోని మధుర, కాశీ, అయోధ్య హిందూ ఆలయాలకు ముక్తి కల్పించాలని వేడుకున్నారు. అర్థంపర్థంలేని సెక్యులర్ వ్రతంతో సెక్యులర్ ప్రభుత్వాలు చేసిన పిచ్చి ప్రయత్నాలు హిందువుల్లో అసహనానికి కారణం అయ్యాయి. అయోధ్య స్వాభిమాన ఉద్యమంగా మారింది. అంగర్‌కోట్ ఆలయం, అక్షరధామ్ ఆలయం చాలా గొప్ప కట్టడాలుగా ఉన్నా ఈ అయోధ్య రామాలయం స్వాభిమానం ప్రకటిస్తున్నది. అందుకే ఇపుడు ఇంత ప్రాధాన్యత పెరిగింది.
ప్రపంచమే అయోధ్య వైపు చూస్తున్నది
దేశమే కాదు ప్రపంచమే అయోధ్య వైపు చూస్తున్నది. రామదర్శనం తర్వాత ఆ పేరుతో జాతీయవాదం బలపడుతున్నది. రామాలయం నుంచి రామరాజ్యం వైపు పయనం గతంలోనే ఈ దేశంలో రామ రాజ్య భావన ఒక కల్పనగా ఉన్నది. గాంధీ కన్నా ముందు తిలక్, గాంధీ తర్వాత చివరకు రాజీవ్ గాంధీ కూడా ఫైజాబాద్‌లో రామరాజ్య భావన ప్రకటించాడు. రామరాజ్యం దయ, కరుణ, సత్యం, ధర్మం సమంగా ఉండే సంక్షేమరాజ్యం. అలాంటి రాముడు మొత్తం జాతి హృదయంలో కొలువై ఉన్నాడు. అందుకే ప్రతి వ్యక్తి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా నిత్య సమరంతో శాంతి కోసం ప్రయత్నిస్తున్నాడు. రాముడు భారతీయుల హృదయాల్లో భౌతికంగా పోరాట యోధుడిగా, అంతర్గతంగా రామతారక పరబ్రహ్మంగా కొలువుదీరి ఉన్నాడు.
అదీ రామతత్వం!
ఒకప్పడు శివాజీ పట్టాభిషేకానికి సమస్య ఎదురైతే కాశీ నుంచి ‘గంగభట్ట’ అనే వేదమూర్తి వచ్చి సమస్య తేల్చేసి క్రతువు జరిపించాడు. కొల్హాపూర్ సంస్థానం అధిష్ఠించిన సాహూ మహరాజ్కూ పంచగంగ ఘాట్‌లో ఇలాంటి అవమానం జరిగితే ‘సెవెకరి’ అనే వైదికుడు దాన్ని సరిదిద్దాడు. ఇప్పడు రాముడు భారత ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలబడ్డ ధీరుడు. ఆయనకు జరుగుతున్న ఈ ప్రాణప్రతిష్ఠ పట్టాభిషేకం తిలకించి ఆనందించాలి గాని, అగ్నిలో ఆజ్యం పోయొద్దు. ఇప్పుడు మరోసారి ‘హిందూ చైతన్యం’ వెల్లివిరుస్తున్నది.
విల్లు ఎక్కుపెడుతున్నది. త్యాగయ్యకైనా, రామదాసుకైనా, శబరికైనా ఇప్పటి సామాన్య రామభక్తుడికైనా ఆరాధ్యుడు రాముడే. శ్రీరాముడు దేవుడని రామాయణం చదివితే గొప్ప మానవుడుగా దర్శనం ఇస్తాడు. అలాగే రాముడు మానవుడని రామాయణం పఠిస్తే చివరకు ఇతడు మానవుడు కాదు దేవుడనిపిస్తుంది. అదీ రామతత్వం.
- డా. పి. భాస్కర యోగి,సామాజిక, ఆధ్యాత్మిక విశ్లేషకుడు