ధరణిలో వచ్చిందని.. బస్టాండ్​ కబ్జా చేసిన వారసుడు

  • గిఫ్ట్ గా వచ్చిన స్థలాన్ని  రికార్డుల్లో ఎక్కించుకోని ఆఫీసర్లు
  • ఎకరా భూమి తనదేనంటూ కోర్టుకెక్కిన వారసుడు
  • హైకోర్టు నుంచి ఆర్టీసీ అధికారులకు నోటీసులు

ఖమ్మం/ కారేపల్లి, వెలుగు: రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తికాకుండానే ఆగమేఘాల మీద తెచ్చిన  ధరణి పోర్టల్​వల్ల కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఏండ్ల క్రితం సాదాబైనామా ద్వారా, గిఫ్టు కింద చేతులు మారిన భూముల రికార్డులన్నీ కొత్త యాజమానుల పేర్లమీద వస్తుండడంతో న్యాయ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఆర్టీసీ బస్టాండ్​ ఉన్న దాదాపు రూ.2 కోట్ల విలువైన ఎకరా భూమి తనదేనంటూ ఓ వ్యక్తి  హైకోర్టును ఆశ్రయించాడు. రాత్రికి రాత్రి ఆ ప్లేస్​ లో ఉన్న  పాత బస్టాండ్​ ను కూల్చివేసి, భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశాడు. సుమారు 30 ఏళ్ల క్రితం ఒక రిటైర్డ్ టీచర్​, బస్టాండ్​ నిర్మాణం కోసం ఆర్టీసీకి ఎకరా జాగా ఇచ్చాడు. కానీ అప్పటి ఆఫీసర్లు రికార్డుల్లో ఎక్కించుకోకపోవడంతో ధరణిలో పాత యజమాని పేరే పట్టాదారుగా ఎంటరైంది. దీంతో ఆయన వారసుడు జాగా కబ్జా చేయగా, ఆలస్యంగా కండ్లు తెరిచిన ఆర్టీసీ అధికారులు స్వాధీనం కోసం కోర్టు ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. 

ఇదీ జరిగింది..

కారేపల్లి క్రాస్ రోడ్ లోని 370 సర్వే నంబర్​లో మూడెకరాల భూమి ఉంది. దీని పట్టాదారు అయిన ఊట్కూరుకు చెందిన ఏపూరి అనంతరామయ్య.. బంజరకు చెందిన సూరపురెడ్డి వెంకట్ రెడ్డి సోదరులకు నలబై ఏండ్ల క్రితం అమ్మారు. వీరి దగ్గరి నుంచి 1996 లో రిటైర్డ్ టీచర్ సంగబత్తుల వీరారెడ్డి కొన్నారు. భూమి ఏజెన్సీ పరిధిలో ఉన్నందున గిరిజనేతరులు రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం లేకపోవడంతో అగ్రిమెంట్ మీదనే కొన్నారు.1997లో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం ఎకరం భూమిని వీరారెడ్డి దానంగా ఇచ్చారు. తర్వాత ఆర్టీసీ అధికారులకు దానపత్రం కూడా ఇచ్చి భూమిని అప్పగించారు. 1997లోనే ఈ స్థలంలో రూ. 3 లక్షలతో ఆర్టీసీ శాశ్వత బస్టాండ్​ను నిర్మించింది. కంట్రోలర్ ను కూడా నియమించి కొంత కాలం బస్సులను కూడా నడిపింది. అయితే ప్రయాణికులు ఎప్పుడూ వెళ్లే కారేపల్లి క్రాస్ రోడ్​కు ఈ బస్టాండ్ కొంత దూరంగా ఉండడంతో ఇటు రావడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో కొంతకాలం తర్వాత ఆర్టీసీ బస్సులను నిలపడం ఆపేసింది. దీంతో ఇరవై ఏండ్లుగా బస్టాండ్ నిరుపయోగంగానే ఉంటోంది. అయితే కొన్నేండ్ల కింద తెలంగాణ సర్కారు తీసుకువచ్చిన ‘ధరణి’ రికార్డులో ఈ భూమి పట్టాదారు ఏపూరి అనంతరామయ్య పేరు వచ్చింది. దీంతో పట్టాదారు వారసులు ఆర్టీసీ ఆధీనంలోని భూమిపై కన్నేశారు. భూమికి హక్కుదారులం తామేనని వాదించారు. అంతేగాకుండా రెండు నెలల క్రితం రాత్రికి రాత్రే బస్టాండ్ ను కూల్చివేసి చదును చేయించారు. ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూల్చివేసిన ఏపూరి రమేశ్​అలియాస్​ రవిపై కేసు నమోదు చేశారు. కాగా, ధరణి రికార్డుల్లో తమ పేరే ఉందంటూ అనంతరామయ్య వారసులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. తమకు ఆ స్థలంలో పొజిషన్​ ఇప్పించాలని కోరారు. దీంతో ఆర్టీసీ అధికారులకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నోటీసులిచ్చింది. దీంతో కౌంటర్​దాఖలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు.  

అధికారులే ఆ స్థలాన్ని రక్షించాలి

ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో బస్టాండ్​నిర్మాణం కోసం మా నాన్న ఎకరా స్థలాన్ని కొని ఆర్టీసీ అధికారులకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఇన్నేండ్ల నుంచి ఆ స్థలం ఆర్టీసీ ఆధీనంలోనే ఉంది. ధరణి వచ్చాక అమ్మినవారి పేరు రావడంతో వారు అధికారులకు నోటీసులు పంపించారు. ఈ విషయమై ఆఫీసర్లు మమ్మల్ని సంప్రదించారు. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని తమ తండ్రి ఏ ఉద్దేశంతో దానం ఇచ్చారో అది నెరవేరేలా చర్యలు తీసుకోవాలి.   

- సంగబత్తుల శ్రీనివాస్​ రెడ్డి

స్థల దాత కొడుకు స్థలాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం

కారేపల్లి క్రాస్ రోడ్ లోని ఆర్టీసీ స్థలాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఆక్రమణదారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేసు కూడా నమోదైంది. ఆక్రమణదారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆర్టీసీ నుంచి కౌంటర్ ఫైల్ చేస్తున్నాం. త్వరలోనే బస్టాండ్ స్థలంలో బస్సులు కూడా నిలుపుతాం.

- శ్రీనివాసరావు, 
ఆర్టీసీ ఖమ్మం డిపో మేనేజర్