అబూజ్​మఢ్​ను కాపాడేందుకే ఏరివేత

అబూజ్​మఢ్​ను కాపాడేందుకే ఏరివేత

భద్రాచలం, వెలుగు: ‘మఢ్​ బచావో అభియాన్’​ విజయవంతం అయిందని బస్తర్​ డీఐజీ కేఎల్​ ధ్రువ్, నారాయణ్​పూర్​ ఎస్పీ ప్రభాత్​ కుమార్​ వెల్లడించారు. ఆదివారం వారు మీడియా సమావేశం ఏర్పాటుచేసి వివరాలు తెలిపారు. మావోయిస్టుల నుంచి మూల ఆదివాసీలు జీవించే అబూజ్​మఢ్​ ప్రాంతాన్ని రక్షించేందుకు ‘మఢ్ బచావో అభియాన్’​ ప్రారంభించామని తెలిపారు. దీనిలో భాగంగా తమ బలగాలతో శనివారం కుతుల్​ ప్రాంతంలో గాలింపు చేపడుతుండగా.. ఎన్​కౌంటర్​ జరిగిందని, ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా మొత్తం 8 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పారు. మృతులను సుద్రూ, వర్గేశ్, మమత, సమీరా, కోశీ, మోతీగా గుర్తించామని, మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఒక ఇన్సాస్​ తుపాకీ, రెండు 303 రైఫిల్స్, మూడు 315 బోర్​ రైఫిల్స్, ఒక బీజీఎల్​ను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అలాగే ఆ ఎన్​కౌంటర్ లో చనిపోయిన ఎస్టీఎఫ్​ జవాన్​ను నితీష్​ ఎక్కాగా గుర్తించామని, లేఖ్​రాం నేతాం, కైలాష్​ నేతం అనే జవాన్లు గాయపడ్డారని వెల్లడించారు.