- ఇంటెలిజెన్స్ వ్యవస్థ, టెక్నాలజీతో మావోయిస్టుల కదలికపై నిఘా
- తాజా ఎన్కౌంటర్లో 15 మంది మహిళలు మృతి
- మొత్తం 29 డెడ్‌బాడీలను బయటకుతెచ్చిన పోలీసులు
- 30కి పైగా ఆయుధాలు స్వాధీనం
భద్రాచలం, వెలుగు: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో బస్తర్ బలగాలు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నాయి. గూగుల్ మ్యాప్‌కు కూడా దొరకని అబూజ్‌మఢ్‌లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ, టెక్నాలజీ సాయంతో మావోయిస్టుల ప్రతి కదలికపైనా నిఘా పెట్టాయి. మూడు నెలల్లో 71 మంది నక్సల్స్ ను ఎన్కౌంటర్ చేశాయి. దండకారణ్యంలోని అబూజ్‌మఢ్ మావోయిస్టులకు కంచుకోట. మంగళవారం పోలీసులు 29 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసిన కాంకేర్జిల్లాలోని చోటేబైఠియా ప్రాంతం కూడా అబూజ్మఢ్లోనే ఉంది.
ఈ ప్రాంతంలో బస్తర్ బలగాలు పాగా వేయడం వెనుక భద్రతా బలగాల సుదీర్ఘ శ్రమ దాగి ఉంది. ఇక్కడ ఆదివాసీలు మొత్తం మావోయిస్టు పార్టీకి సానుభూతిపరులే. అందుకే భద్రతా బలగాలు అడుగుపెడితే క్షణాల్లో వాళ్లకు సమాచారం తెలిసిపోతుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ 2014–-17 మధ్య కాలంలో ఆ ప్రాంతంలోకి సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వుడ్గార్డ్స్ (డీఆర్జీ) బలగాలు భారీగా చొచ్చుకుపోయాయి. మారుమూల పల్లెల్లో రోడ్లు నిర్మించడం, సెల్‌టవర్లు ఏర్పాటు చేయడం, యువతను ఆకర్షించడం లాంటి కార్యక్రమాల్లో సక్సెస్ అయ్యాయి.
మినీ థియేటర్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం, సంక్షేమం అందించడంతో పాటు అక్కడి ప్రజలను బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేయడం ద్వారా ఇంటెలిజెన్స్వ్యవస్థను పటిష్టం చేసి బస్తర్‌పై ఆధిపత్యం సాధించాయి. దీంతో ఇప్పుడు అక్కడ చీమ చిటుక్కుమన్నా వెంటనే భద్రతా బలగాలకు తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ఉండే ఐదు ఏరియా కమిటీల్లోని 250 మంది సాయుధ మావోయిస్టుల సమాచారం మొత్తం భద్రతా బలగాల గుప్పెట్లోకి వెళ్లింది. ఇందులో భాగంగానే కాంకేర్ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
దీనికి తోడు కేంద్ర హోంశాఖ కొంతకాలంగా చత్తీస్‌గఢ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో బలగాలకు స్పెషల్ట్రైనింగ్ ఇప్పించింది. వానాకాలంలో కూంబింగ్, గుట్టల్లో దాడులు చేయడంపై సీఆర్పీఎఫ్ బలగాలకు శిక్షణ ఇచ్చారు. బస్తర్ ఫైటర్స్ పేరుతో మహిళా కమాండోలను కూడా రంగంలోకి దించారు. సెల్టవర్ల సిగ్నల్స్ ఆధారంగా మావోయిస్టు లీడర్ల ఆచూకీ కనిపెడుతున్నారు. దీనివల్లే బస్తర్ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
భోజనం చేసి సేద తీరుతున్న సమయంలో మెరుపుదాడి
ఈ నెల 5న కాంకేర్ జిల్లా చోటేబైఠియా ప్రాంతంలో మావోయిస్టుల కదలికలకు సంబంధించిన సమాచారం కేంద్ర హోంశాఖకు చేరింది. ఈ సమాచారం గ్రిడ్ లొకేషన్‌ను బస్తర్ ఐజీకి పంపించారు. స్థానికంగా ఉన్న తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా పక్కా వివరాలు సేకరించారు. ఎన్నికల వేళ మావోయిస్టులు విధ్వంసం సృష్టించేందుకు వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుసుకున్నారు. కాంకేర్ ఎస్పీ ఐకే ఎలిసేలా నేతృత్వంలో బీఎస్ఎఫ్, డీఆర్ జీ బలగాలను రంగంలోకి దించారు. సోమవారం రాత్రి నుంచే వీరి వేట మొదలైంది.
మంగళవారం చోటేబైఠియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండా-కోరేనార్ అడవుల్లో మావోయిస్టులు మకాం వేసిన ప్రాంతానికి బలగాలు చేరుకున్నాయి. మధ్యాహ్నం భోజనం చేసి సేద తీరుతున్న సమయంలో అదను చూసి బలగాలు ఒక్కసారిగా మెరుపుదాడికి దిగాయి. ఎన్కౌంటర్ల స్పెషలిస్టు సీఐ లక్షణ్ కేత్ ఆధ్వర్యంలో బలగాలు చుట్టుముట్టి 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. తేరుకునే లోపే మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. మిగిలిన వారు పోలీసులను నిలువరించేందుకు 4 గంటల పాటు పోరాడారు. ఎన్నోసార్లు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న కమాండర్ శంకర్రావు ఈసారి భద్రతా బలగాల వలకు చిక్కారు.
తొమ్మిది మృతదేహాల గుర్తింపు: సుందర్రాజ్, బస్తర్ ఐజీ
ఎన్కౌంటర్లో మృతిచెందిన తొమ్మిది మావోయిస్టుల డెడ్‌బాడీలను గుర్తించినట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ పీ తెలిపారు. డీఐజీ కెల్ ధ్రువ్, కాంకేర్ ఎస్పీ ఐకే ఎలిసేలాతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్కౌంటర్జరిగిన ప్రాంతం నుంచి మావోయిస్టుల డెడ్‌బాడీలను బయటకు తీసుకొచ్చినట్టు చెప్పారు. చనిపోయిన మావోయిస్టులలో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారని చెప్పారు.
అందులో దళ కమాండర్ శంకర్రావు, అతని భార్య రజిత, జనతన సర్కారు సమన్వయ కర్త లలిత, ఉత్తర బస్తర్దళ సభ్యురాలు మాధవి, పరతాపూర్ ఏరియా కమిటీ సభ్యులు జుగనీ అలియాస్ మాలతి, సుఖ్ లాల్, శ్రీకాంత్, ఎల్ఓఎస్ కమాండర్ రూపీ మెడ్కీ, ఉత్తర బస్తర్ కమిటీ సభ్యురాలు రంశీలాను గుర్తించామని తెలిపారు. అలాగే, ఘటనా స్థలంలో ఏకే-47, ఇన్సాస్, 303, ఎస్ఎల్ఆర్ తదితర 30కి పైగా ఆయుధాలతో పాటు వాకీటాకీలు, రాకెట్లాంఛర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అవన్నీ బేస్ క్యాంపులు, పోలీసులపై దాడి చేసి మావోయిస్టులు లూటీ చేసిన ఆయుధాలేనని ఆయన తెలిపారు. కాగా, 2023లో జరిగిన 70 ఎన్కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు చనిపోయారని, ఈ ఏడాది ఇప్పటివరకు 79 మంది మావోయిస్టులను మట్టుబెట్టామని ఐజీ వెల్లడించారు. అలాగే, జనవరి నుంచి 394 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.