జిల్లాల్లోనూ బస్తీ దవాఖాన్లు ఏర్పాటు చేస్తాం

  • వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో ఏర్పాటు: ఈటల 

హైదరాబాద్ , వెలుగు: వరంగల్‌‌, కరీంనగర్‌‌, ఖమ్మం తదితర కార్పొరేషన్లలోనూ బస్తీ దవాఖాన్లు ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో 350 బస్తీ దవాఖాన్ల ఏర్పాటుకు సీఎం  అనుమతి ఇచ్చారని, దశల వారీగా వాటిని విస్తరిస్తున్నామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 225  బస్తీ దవాఖానాలు ఉన్నాయని, అర్బన్‌‌ పీహెచ్‌‌సీలు అందుబాటులో లేని ప్రాంతాల్లో బస్తీ దవాఖాన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.వాటిలో డాక్టర్, ఇద్దరు సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. 10 వేల జ‌నాభా ఉన్న బ‌స్తీల్లో ద‌వాఖానాలు ఏర్పాటు చేశామని, మందుల కోసం నెలకు రూ.20 వేలు కేటాయిస్తున్నామని తెలిపారు. బ‌స్తీ ద‌వాఖానాల‌ను తెలంగాణ డ‌యాగ్నస్టిక్ సెంట‌ర్‌తో అనుసంధానం చేశామని వెల్లడించారు. పద్దులపై చర్చలో ఈటల మాట్లాడుతూ.. కరోనా ఇంకా పోలేదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.