యాదగిరిగుట్ట, వెలుగు: ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి వేరే ప్లేస్ లో ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి ఏడాది గడుస్తున్నా.. నేటికీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని లప్పనాయక్ తండా గ్రామస్తులు యాదాద్రి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ కట్టపై శుక్రవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా లప్పనాయక్ తండా సర్పంచ్ ధీరావత్ బుజ్జి శంకర్ నాయక్, పలువురు నిర్వాసితులు మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణంతో లప్పనాయక్ తండా మునిగిపోతుందని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఒక్కో ఫ్యామిలీకి రూ.7.60 లక్షలు, దాతరుపల్లిలోని 15 ఎకరాలు లేఅవుట్ చేసి 200 గజాల చొప్పున ఇండ్ల స్థలాలు ఇస్తామని నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తుచేశారు.
రిజర్వాయర్ పనులను వేగంగా చేస్తున్న ఆఫీసర్లు.. నిర్వాసితులు మాత్రం సాయం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితుల భూములకు పరిహారం ఇవ్వాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేసి ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు ధర్నా కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ రమేశ్, ఉప సర్పంచ్ మంక్యా నాయక్, మాజీ సర్పంచ్ గాశీరాం, వార్డుసభ్యులు యాదమ్మ, మోహన్, సురేశ్, భారతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.