- దాబాలో బిల్లు కట్టకుండా ఓనర్, ఎస్సైపై కర్రలతో దాడి
- పలువురికి తీవ్ర గాయాలు.. 13 మంది అరెస్ట్
ఖమ్మం రూరల్, వెలుగు: ఖమ్మం రూరల్‌మండలం కోదాడ క్రాస్‌రోడ్డులోని రమేశ్ దాబా వద్ద గంజాయి బ్యాచ్రెచ్చిపోయింది. ఫుడ్డు తిన్నాక బిల్లు కట్టకపోగా, దాబా ఓనర్‌పై దాడి చేశారు. పరిస్థితిని కంట్రోల్చేసేందుకు వచ్చిన స్థానిక ఎస్సైపైనా కర్రలతో దాడి చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం సిటీలోని రేవతి థియేటర్సెంటర్కు చెందిన కొంతమంది యువకులు శనివారం రాత్రి రమేశ్దాబాకు వెళ్లారు.
ఫుడ్తిన్నాక, రూ.2,300 బిల్లు అయితే కట్టకపోగా, దాబా ఓనర్ శ్రీనుతో గొడవకు దిగారు. సముదాయించేందుకు ప్రయత్నించినా వినకుండా దాడిచేశారు. అక్కడే ఉన్న తెల్దారుపల్లికి చెందిన యువకులు గొడవను ఆపేందుకు ప్రయత్నించగా వారిపైనా దాడిచేశారు. రాంబాబు అనే యువకుడి తలకు తీవ్ర గాయమైంది. విషయం తెలుసుకున్న తెల్దారుపల్లి గ్రామస్తులు దాబా వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాల తోలపులాటలో ఖమ్మంకు చెందిన యువకుడికి గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడినవారిని ఖమ్మం గవర్నమెంట్హాస్పిటల్కు తరలించారు.
అయితే రాంబాబును హాస్పిటల్‌కు తీసుకెళ్లిన తెల్దారుపల్లికి చెందిన కొందరు యువకులపై, ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్వద్ద రేవతి సెంటర్‌కు చెందిన 40 మంది యువకులు కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. అక్కడే ఉన్న ఖమ్మం రూరల్ఎస్సై సురేశ్అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఆయనపైనా దాడిచేశారు. ఆసుపత్రిలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. హాస్పిటల్సిబ్బంది, తలుపులు వేసి అడ్డుకున్నారు.
దాడికి పాల్పడిన ఖమ్మం యువకులంతా గంజాయి తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎస్సై అడ్డుకోకపోతే ప్రాణ నష్టం జరిగేదని తెలిపారు. సమాచారం అందుకున్న సీపీ సునీల్ దత్, అడిషనల్ సీపీ, పలువురు ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు హాస్పిటల్వద్దకు చేరుకునేలోపు యువకులు పరారయ్యారు. గాయపడిన నలుగురు యువకులు దొరికారు. ఆదివారం సాయంత్రం నాటికి 13 మందిని పట్టుకున్నారు. సీపీఎస్‌కి తరలించి విచారిస్తున్నారు.