మహా కుంభమేళా.. నదుల్లో పవిత్ర స్నానం చేయటం భారతీయుల ఆనవాయితీ.. ఆచారం. అంతేకాదు పెద్దలకు పిండ ప్రదానం చేయటం సంస్కృతి, సంప్రదాయం. ఇప్పుడు ఓ వ్యక్తి చేసిన పుణ్య స్నానం ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. అతను ఏం చేశాడు అనేది చూద్దామా..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మిశ్రా అనే వ్యక్తి.. అలహాబాద్‌లో జరిగే కుంభమేళాకు వచ్చారు. ఇంటి నుంచి వస్తూ వస్తూ.. చనిపోయిన తన తల్లి ఫొటో తీసుకొచ్చారు. తల్లి ఫొటోతోనే త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. మరణించిన తన తల్లి ఫొటోతో.. గంగ, యమున, సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయటం వల్ల.. తన తల్లికి మోక్షం లభిస్తుందని విశ్వసించి.. ఈ విధంగా చేసినట్లు చెప్పుకొచ్చారు మిశ్రా.
చనిపోయిన తల్లి ఫొటోతో మిశ్రా పుణ్య స్నానం చేయటం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. కొడుకు అంటే ఇలా ఉండాలి.. ఇలాంటి కొడుకు అందరికీ ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 2025, జనవరి 13న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మొదలైన మహా కుంభమేళా.. 2025 ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది. 144 ఏళ్ల తర్వాత వచ్చిన గోదావరి పుష్కరాళ్లలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశీయుల కూడా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు పొటెత్తుతున్నారు. కుంభమేళా తొలి రోజు 1.5 కోట్ల మంది భక్తులు రాగా.. రెండవ రోజు ఏకంగా 3.5 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ అధికారులు వెల్లడించారు. దాదాపు 40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.