కూకట్ పల్లి, వెలుగు: ఎమ్మెల్సీ కూర్మయ్య గారి నవీన్ కుమార్ ఇంట్లో ఆదివారం సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కూకట్పల్లిలోని ఆయన ఇంట్లో 20 అడుగుల ఎత్తులో బతుకమ్మను పేర్చి వేడుక నిర్వహించారు. అనంతరం భారీ బతుకమ్మను ప్రత్యేక వెహికల్లో ఐడీఎల్ చెరువు వద్దకు తరలించి నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర సంస్కృతిలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి పూజించడం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుందన్నారు. అది మనకు మాత్రమే దక్కిన గౌరవమని నవీన్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.