Bathukamma Special : తెలంగాణలో మాత్రమే కాదు.. చాలా రాష్ట్రాల్లో మన బతుకమ్మ చరిత్ర..!

Bathukamma Special : తెలంగాణలో మాత్రమే కాదు.. చాలా రాష్ట్రాల్లో మన బతుకమ్మ చరిత్ర..!

'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...' అన్న పాట ఈ సీజన్ వస్తే తెలంగాణలో ఏ ఊరికి పోయినా వినిపిస్తది. బతుకమ్మ మన గుండెలనింది వచ్చే పాట. మనం ఇష్టంగా చేసుకునే పండుగ. ఇది మన తెలంగాణని దాటి దేశ దేశాలకు కూడా పాకింది. ఈమధ్య కాలంల మన తెలంగాణ వాళ్లు వలసపోయిన అన్ని దేశాలల్ల బతుకమ్మ ఆట, పాట వినిపిస్తున్నది. మన భారతదేశంలో తెలంగాణల కాకుండా, బతుకమ్మ ఇంకా ఎక్కడెక్కడ ఆడుతున్నరో చూద్దాం.

ఉద్యోగానికో, పనికో పట్నం దారి పట్టినవాళ్లు మళ్లీ ఊరి బాట పట్టేది దసరా, బతుకమ్మ పండుగలకే. తల్లి తెలంగాణతో కొన్ని దశాబ్దాల క్రితమే బంధాలు తెగిపోయిన వాళ్ల పరిస్థితి? వాళ్లూ ఇప్పటికీ తెలంగాణ మనుషులుగానే బతుకుతున్నారు. తెలంగాణ బతుకమ్మ ఆటను ఇంకా తమ గుండెల్లోనే పెట్టుకున్నారు. వాళ్లలో కొంతమందికి ఇవ్వాళ మన భాష కూడా రాదు. అయినా సంస్కృతిని మాత్రం మరచిపోలేదు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులో ఎందరో ఇవ్వాళ్టికీ బతుకమ్మ ఆడుతున్నారు.

తమిళ బతుకమ్మ

తమిళులకు భాషాభిమానం ఎక్కువ. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తమ భాషలో మాట్లాడటానికి, తమ భాషను వినిపించడానికే ఇష్టపడతారు. అది తమిళనాడు గడ్డమీద ఉన్న ఇతర భాషల వాళ్లకు కూడా స్ఫూర్తినిచ్చింది. తమిళనాడులో తమిళ మీడియంలోనే చదవాలని చట్టం చేస్తే గోపీనాథ్ అనే ఎమ్మెల్యే తెలుగు బిడ్డల ఇబ్బంది గురించి శాసనసభలో కన్నీటి పర్యంతమయ్యాడు.

తెలుగువాళ్ల భాషాభిమానం, ఒత్తిడి అంతగా ఉంది ఆయనపై. ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో లక్షమందికి పైనే తెలుగువాళ్లున్నారు. సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుసు కదా. అందుకే అంత బాధ. అమ్మభాష మీద అంత అభిమానం. సంస్కృతికి భాష తల్లి వేరు లాంటిది. తల్లి వేరే అంత గట్టిగుంటే ఇక పిల్లవేర్లు ఎలా ఉంటాయి!

తెలంగాణ నుంచి కొన్ని శతాబ్దాల క్రితం వలసపోయిన వాళ్లు తెలంగాణ సంస్కృతిని గుర్తు చేసుకుంటూ ఏటా బతుకమ్మ ఆట ఆడుతూనే ఉన్నారు.తెలుగు పాటలు రాకున్నా వాళ్లకు అర్థమైనంతలో కొన్ని పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతున్నారు. సౌతిండియా మాంచెస్టర్గా పేరున్న కోయంబత్తూరులో బతుకమ్మ పండుగ బాగా ఆడతారు. నియ్యల్ అనే నది ఈ నగరాన్ని తాకుతూనే వెళ్తుంది. బతుకమ్మలు ఆడిన తర్వాత ఈ నది నీళ్లలో బతుకమ్మలను వదులుతారు కోయంబత్తూరులో తమిళం తర్వాత ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగే!

బెంగళూరు, పూనేలో కూడా...

ముంబై, కోయంబత్తూరులాగే బెంగళూరు కూడా బతుకమ్మ పండుగ వచ్చిందంటే బతుకమ్మ పాటలతో కళకళలాడుతుంది. బెంగళూరులో తెలంగాణవాళ్లు చాలామంది ఉన్నారు. ఎప్పటినుంచో ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు. 2015 నుంచి తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో బెంగళూరు పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పూనేలో కూడా బతుకమ్మ పండుగ సందడి జోరుగానే ఉంది. 

దేశమంతా తెలంగాణ వాళ్లు ఉన్నట్టే. రానున్న రోజుల్లో బతుకమ్మ ఉత్సవం కూడా అన్ని పెద్ద నగరాలకు చేరిపోతుందని ఆశించొచ్చు. ఇప్పటికైతే బతుకమ్మ పండుగ రోజులు వస్తే.. బెంగళూరు, ముంబై, కోయంబత్తూరు, పూనే నగరాలు కూడా తెలంగాణలో భాగమైనట్టే కనిపిస్తాయి.

బొంబాయిలో..డీజే పాటల బతుకమ్మ

ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ లో భాగమై ఉన్న ఇప్పటి మహారాష్ట్రలోని ఊళ్లలో ఇంకా తెలంగాణ సంస్కృతి ఉంది. అలాగే తెలంగాణలో కూలీ పనులకు ఎక్కువగా బొంబాయికి వలస వెళ్లిపోతుంటారు. కొందరు అలా వెళ్లి దశాబ్దాల కిందటే అక్కడ సెటిలైపోయారు. వాళ్లలో ఇప్పుడు కొంతమందికి తెలంగాణ భాష రాదు. చాలామందికి బతుకమ్మ పాటలు రావు. అయినా బతుకమ్మ పండుగ వచ్చిందంటే, ఆడి పాడతారు. సౌత్ ముంబైలోని గిర్గాం, బాంద్రా వర్తి, కామాటిపురా ప్రాంతాల్లో బతుకమ్మ పండుగ కళ కనిపిస్తుంది.

బతుకమ్మ పాటలు రాకున్నా డీజే పెట్టి పాటలు ప్లే చేస్తూ తెలుగు ఆడబిడ్డలంతా. బతుకమ్మ ఆడతారు. దగ్గర్లో మార్కెట్ లో దొరికే పూలనే కొని తెచ్చుకొని బతుకమ్మలను పేర్చుతారు. పట్టు చీరలు, పట్టు పరికిణీలు, లంగా ఓణీలు కట్టి పల్లె పదాలు పాడుకుంటూ బతుకమ్మ ఆడుతున్నారు అక్కడి పాటల్లోకి డీజేలు వచ్చినట్లుగానే కోలాటం, దాండియా ఆటలూ చొరబడ్డాయి. భిన్న సంస్కృతుల ముంబైలో తెలంగాణ సంస్కృతి కూడా భిన్నత్వాన్ని స్వీకరించింది. ఇది ముంబయి బతుకమ్మ ప్రత్యేకత.

తెలంగాణ తెలుగు సంఘం కుర్ల (ఈ) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. 2015లో తొలి బతుకమ్మ ఘనంగా నిర్వహించారు. అయితే ఇదేమీ తొలి బతుకమ్మ కాదు. బతుకు చేతబట్టుకుని వచ్చినప్పుడు కూడా బతుకమ్మ ఆడారు. ఆ తర్వాత అది కొన్నేళ కాలంలో మెల్లమెల్లగా కనుమరుగైంది. తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరిన కాలంలో ఆ ఉద్యమ స్ఫూర్తి ముంబైలో ఉన్న ప్రజల్ని కూడా ప్రభావితం చేసింది. అక్కడే ఉన్న తెలంగాణ వాళ్లంతా ఒక దగ్గర చేరి బతుకమ్మను మళ్లీ వైభవంగా జరుపుకోవడం మొదలు పెట్టారు. 

అలా 2015 తర్వాత ఇప్పుడు ముంబైలో బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ పండుగకు హాజరవుతున్నారు. కేవలం ఒక చిన్న సమాజం ఆడుకునే బతుకమ్మ చిన్నగా సెలబ్రిటీలు కూడా ఆడే స్థాయికి చేరింది. ముంబైలో బతుకమ్మ ఆటల కోసం మైదానాల్లో పెద్ద పెద్ద లైట్లను ఏర్పాటు చేసి కార్పొరేట్ ఈవెంట్ల తరహాలో నిర్వహిస్తున్నారు. ముంబైలో ఏడు రోజులే బతుకమ్మ ఆడుతున్నారు.