మహారాష్ట్రకు చెందిన కొన్ని నేతకాని కుటుంబాలు దాదాపు 150 ఏండ్ల కిందట సీతంపేటకు వలస వచ్చినట్లు చెప్తుంటారు. పిల్లాపాపలతో వచ్చిన ఆ కుటుంబాలు ఇక్కడే వ్యవసాయం చేస్తూ బతుకుతున్నారు. నేతకానిల అక్కడి సంప్రదాయం ప్రకారం.. కేదారీశ్వరుడికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించడం ఇక్కడ కూడా మొదలుపెట్టారు. అలా అప్పటినుంచి ఇప్పటివరకు మూడు తరాల వాళ్లు అదే ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నట్లు ఊరివాళ్లు చెప్తున్నారు.
అయితే అక్కడి నేతకానిలు పోలల అమావాస్య జరుపుకుంటారని, దీపావళికి గంగ నోముల పండుగ ఇక్కడ పుట్టిన ఆచారమేనని మరికొందరు అంటున్నారు. సంప్రదాయమేదైనా ఏటా బాగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలనే ఉద్దేశంతోనే ఈ నోము నోస్తారు.
రేగడి మట్టితో జోడెడ్ల బొమ్మలు
సీతంపేటకుచెందిన నేతకాని కులస్తులు వాళ్ల కులదైవమైన కేదారీశ్వరుడికి చేసే పూజల్లో భాగంగా మూడు రోజులు ఉత్సవాలు చేస్తారు. వీటినే గంగ నోములని కూడా పిలుస్తారు. ఇందులో దీపావళినాడు మొదటిరోజు సంప్రదాయం ప్రకారం గ్రామ సమీపంలోని గంగ(చెరువు)కు వెళ్తారు. అక్కడి నుంచి పవిత్రమైన రేగడి మట్టిని తీసుకొచ్చి జోడెడ్ల బొమ్మలు తయారుచేస్తారు. వాటిని తాము పండించిన ధాన్యంతో చేసిన పిండి వంటలతో అలంకరించి, పూజలు చేస్తారు. ఆ తర్వాత రెండో రోజు వాటిని కోలాట నృత్యాలతో పిల్లాపాపలతో ఊరేగింపుగా వెళ్లి, చెరువులో నిమజ్జనం చేస్తారు.
ALSO READ: Bathukamma Special : బతుకమ్మ పూలు ఇచ్చే ఆరోగ్యం, వాటి ఔషధ గుణాలు ఇవే
మూడో రోజు నేతకాని కుటుంబాలకుచెందిన వాళ్లంతా బతుకమ్మలు పేర్చి సాయంత్రం ఆడి పాడతారు. ఆ తర్వాతి రోజు కేదారీశ్వరుడిని ఎత్తుకునే క్రతువుతో మూడు రోజుల ఉత్సవాలు ముగుస్తాయి. నిష్ఠతో పూజలు నేతకానిలు ఈ ఉత్సవాలు జరిపే మూడు రోజులు నిష్ఠతో పూజలు చేస్తారు. ఇండ్లను మామిడి ఆకు తోరణాలతో అలంకరిస్తారు. అప్పటివరకు ఎలా ఉన్నా దీపావళి మొదలైన మొదటి రోజు నుంచి మద్యం, మాంసాలకు దూరంగా ఉంటారు. ఇంటిల్లిపాదీ శుభ్రత పాటిస్తూ పూజలు చేస్తారు. మూడు రోజుల ఉత్సవం ముగిసిన తరువాత ఒక్కపొద్దు విడిచి సంబురాలు చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ కులదైవం కేదారీశ్వరుడు కరుణించి కటాక్షిస్తాడని ఇక్కడి ప్రజల నమ్మకం.