- టాక్ ఆధ్వర్యంలో చేనేత బతుకమ్మ వేడుకలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: లండన్లో చేనేత బతుకమ్మ, దసరా సంబురాలు సోమవారం ఘనంగా జరిగాయి. తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి 2 వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా స్థానిక మేయర్ కారెన్ స్మిత్, భారత సంతతికి చెందిన మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, నిర్మల దంపతులు, భారత హై కమిషన్ ప్రతినిధి అజయ్ కుమార్ ఠాకూర్, తెలంగాణ ఎఫ్డీసీ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, కౌన్సిలర్లు ప్రీతమ్ గ్రేవాల్, అజ్మీర్ గ్రేవాల్, ప్రభాకర్ ఖాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడారు.
చేనేతకు చేయూతనిస్తూ ఈసారి కూడా వేడుకలను ‘చేనేత బతుకమ్మ, దసరా’గా జరుపుకున్నామని తెలిపారు. అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో వేడుకల్లో పాల్గొన్నామని చెప్పారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని మెచ్చుకున్నారు. స్థానికంగా ఎలాంటి సాయం కావాలన్నా తమను సంప్రదించాలని, అంతా ఐకమత్యంగా ఉండి సంప్రదాయాలను గౌరవించుకోవాలని సూచించారు.