
- మాయమవుతున్న జంగళ్లు, గుట్టలు
- ప్రత్యామ్నాయంగా బంతిపూలు వాడుతున్న జనం
మెదక్, వెలుగు: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలైనయ్. శనివారం ఎంగిలిపూల నుంచి పల్లెల్లో చిన్న బతుకమ్మ సంబరాలు నడుస్తున్నయ్. ఇండ్ల పక్కన దొరికే గుమ్మడి, గన్నేరు, కట్ల, రుద్రాక్ష, చక్రం మల్లె, కాడ మల్లె, మందార పువ్వులతోని ఆడబిడ్డలు చిన్న బతుకమ్మలు పేర్చి ఆడుతున్నరు. కానీ, సద్దుల రోజు పెద్ద బతుకమ్మ పేర్చేందుకు అవసరమైన గునుగు, తంగెడు పువ్వుకు ఈసారి కరువొచ్చింది. సీతమ్మ జెడ పూలు కూడా అంతంతే ఉన్నయ్. మెట్ట పంటల స్థానంలో వరి, పత్తి వేస్తుండడం, ఒకప్పటి చెల్కలు రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారడం, జంగళ్లు, గుట్టలు అంతరిస్తుండడంతో చాలా ప్రాంతాల్లో గునుగు, తంగేడు చెట్లు చూద్దామన్నా కనిపిస్తలేవు.
కలుపు మందులతో అంతరిస్తున్న గునుగు
తెలంగాణలో కొన్నేండ్ల కింది వరకు ప్రధానంగా మక్క, జొన్న, కందితోపాటు వివిధ రకాల నూనెగింజలు సాగయ్యేవి. వానాకాలం ఈ చేన్లు, చెల్కల్లో గునుగు సహజంగా పెరిగేది. రైతు కుటుంబాలు బతుకమ్మ కోసం కొంత భాగం గునుగు మొక్కలను తొలగించకుండా వదిలేసేవారు. అదీగాకుండా పెత్తరమాస నాటికి జంగళ్లు, చెల్కభూముల్లోనూ గునుగుపూలు విరసబూసి కనిపించేవి. ఏ ఊరి పొలిమేరకు పోయినా బతుకమ్మకు సరిపడా పువ్వు దొరికేది. కానీ, కొన్నేండ్లుగా రైతులు మెట్ట పంటలు తగ్గించి పత్తి, వరి వేస్తున్నారు.
రాష్ట్రంలో సుమారు కోటి 30 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుంటే..ఇందులో కోటి ఎకరాల దాకా పత్తి , వరే సాగు చేస్తున్నారు. పత్తిలో కలుపు నివారణ కోసం గ్లైఫోసైట్లాంటి మందులు స్ప్రే చేస్తున్నారు. దీంతో గడ్డితో పాటు అదే రకానికి చెందిన గునుగు కూడా చచ్చిపోతోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సుమారు 50 నుంచి 60 లక్షల ఎకరాల్లో పత్తి చేన్ల వల్ల గునుగు పూర్తిగా అంతరించి పోయిందని నిపుణులు చెప్తున్నారు. ఇక కూరగాయలు, ముఖ్యంగా మిర్చి తోటల మధ్యలో విరివిగా పెరిగే సీతమ్మ జడ పూలు(పట్టుకుచ్చు పూలు) కూడా ఎక్కడో తప్ప కనిపించడం లేదు.
తగ్గిన తంగేడు..
బతుకమ్మకు తంగేడు పువ్వే ప్రధాన ఆకర్షణ. పసుపు ఆరబోసినట్టు గుత్తులు గుత్తులుగా ఆకట్టుకునే తంగేడు పువ్వును తెలంగాణ మహిళలు అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే బతుకమ్మలో ఏ పువ్వు పేర్చినా పేర్చకున్నా మొదటి వరుసలో తంగేడును కచ్చితంగా పేర్చుతారు. అందుకే తంగేడును రాష్ట్ర అధికారిక పుష్పంగా ప్రభుత్వం
ప్రకటించింది. కానీ, వీటిని కాపాడేందుకు చర్యలు తీసుకోవట్లేదు.
ఒకప్పుడు గుట్టలు, చెరువు గట్లు, ఖాళీగా ఉండే బీడు భూముల్లో ఎటుచూసినా గుత్తులు గుత్తులుగా తంగేడు పూలు కనిపించేవి. కానీ, రాష్ట్రంలో గ్రానైట్ క్వారీల కోసం గుట్టలను నాశనం చేస్తుండడం, పట్టణీకరణతో బీడుభూములను రియల్టర్లు ప్లాట్లుగా మారుస్తుండడంతో తంగేడు చెట్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. రెండేండ్ల కింద శాతవాహన యూనివర్సిటీ బోటనీ విభాగం ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు, స్టూడెంట్లు నిర్వహించిన రీసెర్చ్‌లోనూ ఈ విషయం వెల్లడైంది.
ప్రత్యామ్నాయ పూలే దిక్కు..
తంగేడు పువ్వు లేకపోవడంతో చాలాచోట్ల రోడ్ల పక్కన పెరిగే హైబ్రిడ్ తంగేడు చెట్ల పూలతో బతుకమ్మలు పేరుస్తున్నారు. అదీ దొరకని వాళ్లు బంతిపూలతో సర్దుకపోతున్నారు. పల్లెల్లోనే కరువు రావడంతో పట్టణాలకు గునుగు, తంగేడు, సీతమ్మ జడ పూలను అమ్మకానికి తెచ్చేవాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ప్రత్యామ్నాయంగా రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి బంతిపూలు తెచ్చి అమ్ముతున్నారు. ఇటీవలి కాలంలో పట్టణాల్లో కొన్నిచోట్ల జర్బరా పూలను సైతం వాడుతున్నారు. అక్కడక్కడ గునుగు, తంగేడు పూలు దొరుకుతున్నా డిమాండ్ కారణంగా ఎక్కువ రేట్లు పలుకుతున్నాయి. గతంలో రూ. 200 పెడితే పెద్ద బతుకమ్మకు సరిపడా పూలు వచ్చేవి, ప్రస్తుతం రూ.500 పెట్టినా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఒకప్పుడు చాలా పెద్దగా పేర్చిన వాళ్లు సైతం ప్రస్తుతం చిన్న సైజుకే పరిమితమవుతున్నారు.
2 కిలోమీటర్లు పోయినం..
ఒకప్పుడు ఊరి పొలిమేరల్లోనే కావాల్సినంత తంగేడు, గునుగు దొరికేది. ఇప్పుడు చేన్లు, చెలకలు లేక ఎక్కడా పువ్వు దొరుకుతలేదు. రెండు కిలోమీటర్ల నడుచుకుంటూ వెళ్తే ఈ మాత్రమైనా గునుగు దొరికింది. గతంలో ఊరి శివార్లలోనే మోపులకొద్దీ గునుగు కోసి తెచ్చి, నిలువెత్తు బతుకమ్మలు పేర్చేవాళ్లం. కానీ ఇప్పుడు పువ్వులు దొరకక చిన్న బతుకమ్మలతో సరిపెడ్తున్నం.
- మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామ మహిళలు
ప్రకృతి విధ్వంసం వల్లే..
ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే తంగేడు, గునుగు పువ్వులనే బతుకమ్మ తయారీలో ఉపయోగించడం ఆనవాయితీ. కానీ, కొన్ని సంవత్సరాలుగా ఈ పువ్వుల లభ్యత తగ్గుతూ వస్తోంది. ఇందుకు ప్రకృతి విధ్వంసమే ప్రధాన కారణం. తంగేడు పూలు ముఖ్యంగా అడవులు, బంజర్లు, కొండ కోనల్లో ఎక్కువగా దొరుకుతాయి. కొన్నేండ్లుగా అడవులను, గుట్టలను ధ్వంసం చేయడం, ఫార్మ్‌హౌస్‌లు, ప్లాట్లుగామార్చడంతో పూలు దొరకడం గగనమవుతోంది. పంట చేలల్లో ఒకప్పుడు విరివిగా పెరిగే గునుగు కూడా కలుపు నాశనుల కారణంగా కనుమరుగవుతున్నది.
- డాక్టర్ ప్రశాంత్, ప్రిన్సిపల్ సైంటిస్టు, కొండా లక్ష్మణ్‌బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ, ములుగు, సిద్దిపేట జిల్లా