వెలుగు, నెట్వర్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కలెక్టరేట్లలో బతుకమ్మ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. పాలమూరులో కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మకు పూజలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాగర్ కర్నూల్ లో అడిషనల్ కలెక్టర్ సీతారామారావు పూజలు చేసి బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి కలెక్టరేట్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు జరిగాయి.
వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గిరిధర్ పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కల్వకుర్తి కోర్టులో జరిగిన బతుకమ్మ సంబరాల్లో సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, జూనియర్ సివిల్ జడ్జి కావ్య బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. మక్తల్ పట్టణంలోని శబరి, దత్తకాలనీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మహిళలు, యువతులు రంగురంగు పూలతో తయారు చేసిన బతుకమ్మలతో ఆడిపాడి సందడి చేశారు.