బతుకమ్మ.. ఆశ్వయుజ మాసంలో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 2న మొదలు కానున్న బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 10 దుర్గాష్టమితో ముగియనున్నాయి. పండుగ రోజుల్లో మహిళలు, అమ్మాయిలు రంగు రంగుల పూలతో బతుకమ్మను త్రికోణాకారంలో అలంకరించి.. ఆ బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తారు. మనం ఇంత వైభవంగా చేసుకుంటున్న బతుకమ్మ పండుగ ఎప్పటిది? దాని పూర్వాపరాలు ఏంటి..? అనేది తెలుసుకుందాం..
బతుకమ్మ పుట్టిందెక్కడ..?
నిజానికి బతుకమ్మ ఎప్పట్నుంచి చేసుకుంటున్నాం అనే దానికి కచ్చితమైన ఆధారాలు లేవు. బతుకమ్మ పండుగ ఏనాటిదో తెలుసుకోవాలని చాలాకాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జానపద సాహిత్యంపై పరిశోధన చేసిన బిరుదురాజు రామరాజు నుంచి నేటి పరిశోధకుల వరకు కొన్ని ఆధారాలను సేకరించినా, ఆ పండుగ పుట్టుక, ఆనాటి అవసరాలు, విశేషాలకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలను మాత్రం గుర్తించలేకపోయారు. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రమంతటా, సరిహద్దు ప్రాంతాల్లో, మధ్య యుగాలలో ఇక్కడి నుంచి తమిళ దేశానికి వలస పోయిన ప్రాంతాలలోనూ (కోయంబత్తూరు, హోసూరు) బతుకమ్మ జరుపుకుంటున్నారు. ఈ వారసత్వం ఆధారంగా బతుకమ్మ దక్కన్ లో పుట్టిన పండుగగా గుర్తించవచ్చు. అడవి పూలతో ఆడే పండుగ కావడంతో ఇది పట్టణ నాగరికత నుంచి కాకుండా గ్రామీణ నాగరికత నుంచి వచ్చిన పండుగగా అర్థం చేసుకోవచ్చు.
బతుకమ్మపై పరిశోధన
బతుకమ్మ సంప్రదాయం వెనకున్న విశేషాలను చెప్పేందుకు పలువురు పరిశోధకులు ఆసక్తి చూపారు. బతుకమ్మ పండుగ మీదనే ప్రత్యేకంగా పరిశోధించి రాయకున్నా జానపద సాహిత్యం. జానపద గాథలపై ప్రచురించిన పలు పుస్తకాలు బతుకమ్మ విశేషాలను వివరిస్తున్నాయి. ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజు, ప్రొఫెసర్ నాయని కృష్ణకుమారి మరెందరో జానపద సాహిత్య పరిశోధకుల జానపద గేయాల సేకరణ, జానపద గాథల సంకలనాల్లో బతుకమ్మ విశేషాలు నమోదయ్యాయి.
బతుకమ్మ పండుగను వివరిస్తూ 'హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బతుకమ్మ పాటలు - సామాజికాంశాల పరిశీలన' అనే పుస్తకాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎస్. శరత్ జ్యోత్సారాణి 2001లో ప్రచురించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మ విశిష్టతను వివరిస్తూ బండారు సుజాతా శేఖర్ 'బతుకమ్మ పాటలు పౌరాణిక, సాంస్కృతిక, సామాజిక భాషా పరిశీలన' అనే పుస్తకం రాశారు. బతుకమ్మ సంస్కృతిని విశ్లేషిస్తూ తాటికొండ విష్ణుమూర్తి 'బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు' రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిశోధకురాలు తిరునగరి దేవకీ దేవి 'బతుకమ్మస్త్రీల మనోభావాలు, పాటల పరిణామక్రమం' అనే పరిశోధనాత్మక గ్రంథం ప్రచురించారు.