మన బతుకమ్మకు అమెరికాలో  అధికారిక గుర్తింపు

మన బతుకమ్మకు అమెరికాలో  అధికారిక గుర్తింపు
  • ఈ నెల 11 వరకు తెలంగాణ హెరిటేజ్ వీక్
  • ఉత్తర్వులు జారీ చేసిన నార్త్​కరోలినా, జార్జియా, వర్జీనియా గవర్నర్లు

వాషింగ్టన్: మన బతుకమ్మ పండుగకు అమెరికాలోని మూడు రాష్ట్రాల్లో అధికారిక గుర్తింపు దక్కింది. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ‘స్పెషల్ బతుకమ్మ ఫెస్టివల్ వీక్’, ‘తెలంగాణ హెరిటేజ్ వీక్​’ని అక్కడి నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా రాష్ట్రాలు ప్రకటించాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మన పూల పండుగ, మన సంస్కృతిని కొనియాడారు. విభిన్న భాషలు, సాంప్రదాయలకు నెలవుగా తెలంగాణ మారిందని ప్రశంసించారు. ఇండియన్ కల్చర్​కు తెలంగాణ పూల పండుగ ప్రతిబింబంగా నిలిచిందని తెలిపారు. బతుకమ్మ వైభవాన్ని అందరికీ తెలియజేసేలా ఆడి పాడాలని సూచించారు. బతుకమ్మ అంటే ఒక ఫెస్టివల్ మాత్రమే కాదని.. ప్రకృతి, సమాజం, మహిళలు జరుపుకునే ఓ శక్తివంతమైన పూల పండుగ అని అభివర్ణించారు. సంస్కృతీ, సాంప్రదాయాలకు గుర్తింపు అని కొనియాడారు.

తమ ప్రభుత్వం తరఫున బతుకమ్మ పండుగకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. పూల పండుగలో భాగంగా జానపద పాటలు, సాంప్రదాయ నృత్యాలు ఎంతో బాగుంటాయని ప్రశంసించారు. ఈ నెల 3 నుంచి 11వ తేదీ దాకా ‘తెలంగాణ హెరిటేజ్ వీక్’​గా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, భాషను కీర్తించారు. కాగా, గతంలో కూడా కొన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలు బతుకమ్మకు అధికారిక గుర్తింపునిచ్చాయి.