ఇయ్యాల్టి నుంచి బతుకమ్మ సంబురాలు

ఇయ్యాల్టి నుంచి బతుకమ్మ సంబురాలు
  • ఎంగిలిపూలతో మొదలు
  • తొమ్మిదిరోజులు ఊరూరా వేడుకలు

హైదరాబాద్​, వెలుగు: పూల జాతర.. మన బతుకమ్మ పండుగ వచ్చేసింది! పెత్రామాస నుంచి మొదలు దసరాకు ముందు రోజు దాకా పల్లె, పట్నం ఉయ్యాల పాటలలో ఉయ్యాలలూగనున్నాయి. ఆడబిడ్డల ఆటలకు యావత్​ తెలంగాణ కైగట్టనుంది. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పూల సంబురం షురూ కానుంది. స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించడంతో అంతటా పండుగ వాతావరణం నెలకొంది.
తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చేందుకు ఆడబిడ్డలు సిద్ధమవుతున్నారు. పల్లెల్లో పూసిన గునుగు, తంగేడు, బంతి, సీతమ్మజెడ పూలను పట్నాలకు వ్యాపారులు తరలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచే హైదరాబాద్​ సహా  జిల్లా కేంద్రాల్లోని చౌరస్తాలు పూలతో కలర్‍ఫుల్‍గా మారిపోయాయి. బతుకమ్మ పేర్చడానికి అవసరమైన పూలను కట్టల చొప్పున విక్రయిస్తున్నారు. రంగుల్లో అద్దిన గునుగు కట్టలకు తోడు బంతి, చామంతి పూలకు మార్కెట్లో మంచి గిరాకీ లభిస్తున్నది.  

సీఎం రేవంత్​రెడ్డి శుభాకాంక్షలు

తెలంగాణ ఆడబిడ్డలందరికీ సీఎం రేవంత్​రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పూలను పూజిస్తూ  ప్రకృతిని ఆరాధిస్తూ మ‌‌‌‌‌‌‌‌హిళ‌‌‌‌‌‌‌‌లు అత్యంత వైభ‌‌‌‌‌‌‌‌వంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బ‌‌‌‌‌‌‌‌తుక‌‌‌‌‌‌‌‌మ్మ అని అన్నారు. బతుకమ్మ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలనిసీఎం ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కష్టాలను తొలగించాలని‌‌‌‌‌‌‌‌ గౌరమ్మను సీఎం రేవంత్​ ప్రార్థించారు.