9 రోజులు..9 రకాల పేర్లు..8 నైవేద్యాలు.. అక్టోబర్ 14 నుంచి బతుకమ్మ పండగ

పూలను పూజించే గొప్ప పండగ బతుకమ్మ పండగ. తెలంగాణ సాంప్రదాయానికి ఈ బతుకమ్మ పండగ ప్రతీక. ఆడబిడ్డలందరూ పుట్టింటికి చేరి..తీరొక్క పూలను సేకరించి..సంతోషంగా బతుకమ్మ పండగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పల్లె..పట్నం బతుకమ్మ పండగను జరుపుకోవడానికి సిద్దమైంది. అక్టోబర్ 14వ తేదీ నుంచి రాష్ట్రంలో పూలను పూజించే పండగ ప్రారంభం కానుంది. 

బతుకమ్మ సంబరాలు  మహాలయ అమావాస్య నాడు ప్రారంభమై ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు.  తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకల్లో  ఒక్క రోజు మినహా మిగిలిన మిగతా ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు.

తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ.. ఎంగిలి పూల బతుకమ్మ రోజును పెత్రామాస అని కూడా అంటారు. ఈ పండుగ మహాలయ అమావాస్య అంటే భాద్రపద అమావాస్య నాడు మొదలవుతుంది. 
ఎంగిలిపూల బతుకమ్మ రోజు  బియ్యంపిండి లేదా తడి బియ్యంతో నువ్వులను నైవేద్యంగా సమర్పిస్తారు. 

రెండో రోజు  అటుకుల బతుకమ్మ... ఆశ్వయుజ మాసంలో పాడ్యమి వచ్చే రెండో రోజును అటుకుల బతుకమ్మ అంటారు. అటుకుల బతుకమ్మ రోజున సప్పిడి పప్పు, బెల్లం , అటుకులు నైవేద్యంగా పెడతారు. 

మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ.. విదియ లేదా ఆశ్వయుజ మాసం మూడో రోజున వస్తుంది. ఈ బతుకమ్మ రోజున ముద్దపప్పు , పాలు, బెల్లంతో కలిపి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.  

నాలుగో రోజు  నానబియ్యం బతుకమ్మ.. ఆశ్వయుజ మాసంలో నాల్గో రోజున ఈ బతుకమ్మను పేరుస్తారు. నానబెట్టిన బియ్యం , పాలు, బెల్లం నైవేద్యంగా పెడతారు. 

ఐదో రోజు అట్ల బతుకమ్మ.. ఆశ్వయుజ మాసంలో ఐదవ రోజున అట్ల బతుకమ్మను తయారు చేస్తారు. ఈ రోజున గోధుమ అట్లు లేదా..బియ్యం పిండితో చేసిన అట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. 

ఆరో రోజు  అలిగిన బతుకమ్మ..: ఆశ్వయుజ మాసంలో  పంచమి నాడు ఆరో రోజున  వస్తుంది. ఈ రోజు బతుకమ్మ అలకవోతుంది. కాబట్టి బతుకమ్మను పేర్చరు..ఎలాంటి నైవేద్యం పెట్టరు. 

ఏడో రోజు వేపకాయల బతుకమ్మ..: ఆశ్వయుజ మాసంలో ఏడో రోజు  ఈ బతుకమ్మను పేరుస్తారు. నైవేద్యంగా  వేపచెట్టు పండ్ల ఆకారంలో ఉండే సకినాల పిండితో  వంటలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. 


ALSO READ : అక్టోబర్ 18న కొండగట్టుకు రాహుల్ గాంధీ.. అంజన్న ఆలయంలో పూజలు

ఎనిమిదో రోజు  వెన్నముద్దల బతుకమ్మ.. ఆశ్వయుజ మాసంలో ఎనిమిదో రోజు ఈ బతుకమ్మను తయారు చేస్తారు. నైవేద్యంగా నువ్వులు, వెన్నను పెడతారు.

చివరి రోజు..అంటే తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ..: ఆశ్వయుజ మాసంలో తొమ్మిదవ రోజు  బతుకమ్మను దుర్గాష్టమితో జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర , నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం,  నువ్వల సద్ది వంటకాలను తయారు చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.