
అంబర్‌పేట, వెలుగు: బాగ్అంబర్పేటలోని బతుకమ్మకుంటలో గంగమ్మ ఉప్పొంగింది. చెరువు పునరుద్ధరణ పనుల్లో భాగంగా హైడ్రా అధికారులు మంగళవారం జేసీబీతో మోకాలు లోతున తవ్వగా, నీరు ఉబికి వచ్చింది. దీంతో బతుకమ్మకుంట బతికే ఉందంటూ స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది తమ స్థలమంటూ ఇప్పటివరకూ నమ్మబలికిన వారు ఇప్పుడేమంటారని ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా నింపిన మట్టిని తొలగిస్తే చెరువు కళకళలాడుతుందని చెబుతున్నారు.
బతుకమ్మకుంటలోని ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో కమిషనర్ ఏవీ రంగనాథ్ఇటీవల చెరువును పరిశీలించారు. అక్కడ ఉంటున్న వారికి ఎలాంటి ముప్పు లేకుండా బతుకమ్మకుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. బ్యూటిఫికేషన్ పనుల్లో భాగంగా మంగళవారం అక్కడి ముల్ల పొదలను తొలగించారు.
జేసీబీతో మోకాలు లోతున తవ్వగా నీరు ఉబికి వచ్చింది. 1962-63లోని ప్రభుత్వ లెక్కల ప్రకారం బాగ్‌అంబర్‌పేట సర్వే నంబర్ 563లో 14.06 ఎకరాల్లో బతుకమ్మకుంట ఉంది. బఫర్‌జోన్‌తో కలిపితే 16.13 ఎకరాలు. కొన్నేండ్లుగా నిర్మాణ వ్యర్థాలతోపాటు మట్టితో నింపుతూ కబ్జా చేస్తుండడంతో ప్రస్తుతం చెరువు 5.15 ఎకరాలకు చేరుకుంది.
ఇలాగే వదిలేస్తే ఆనవాళ్లు లేకుండా చేసేలా ఉన్నారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కాగా, బతుకమ్మ కుంట స్థలం తనదంటూ స్థానిక నాయకుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఒకప్పటి ఎర్రకుంటనే.. కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందని, రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని హైడ్రా అధికారులు తేల్చారు.