బతుకమ్మ పాటల్లో బతుకు గోస

బతుకమ్మ పండగ కేవలం మహిళలు చేసుకునే పండగ మాత్రమే కాదు. దక్కన్ పీఠ భూమిలో శ్రమజీవులు చేసుకునే , కొలుచుకునే ప్రకృతి కొలుపు.  స్త్రీల త్యాగ చరిత్రను గుర్తు చేస్తుంది. మహిళను ప్రకృతితో పోల్చి చూపిస్తుంది. ప్రాచీన సాహిత్య గ్రంథాలలో రాసిన స్త్రీల త్యాగాల గుర్తింపుగా చెప్పుకునే పండుగల్లో ఇది ప్రముఖమైనది. తమ బతుకులు, తమ వారసత్వాలు కలకాలం నిలవాలని కోరుకునే పండగ. గుడి లేని దేవుడి పండగ ఇది. క్రీ.శ. ఐదారు శతాబ్దాల నుండే బతుకమ్మ పండగ ఉన్నట్లు చారిత్రక గ్రంథాలు, జానపదుల పాటలను బట్టి తెలుస్తున్నది.

నవరాత్రుల్లో రోజుకో రూపుతో అమ్మ వారిని కొలుచుకుంటారు భక్తులు. ఈ సందర్భంగా వారు పాడే పాటల్లో మగవాళ్ల ఆధిపత్యాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేసిన స్త్రీల ప్రస్తావనే ఎక్కువగా ఉంటుంది. ఇదంతా కేవలం పాటగా మాత్రమే కాదు, స్త్రీమూర్తులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడం కూడా.

బతుకమ్మ సంబురాలలో పాడుకునే ఉయ్యాల పాటలు, చందమామ పేరుతో వచ్చే పాటల్లో చాలా చారిత్రక విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఇందులో స్థానిక సంస్థానాల ప్రభువులు పెట్టిన కష్టాలు, గ్రామాల్లో పెత్తందార్ల దాష్టీకాలను తట్టుకున్న మహిళల జీవన స్థితిగతులు బొడ్డెమ్మ పాటల రూపంలో వస్తాయి. డీజేల కాలంలో ఉన్నాం కాబట్టి ఈ పాటల చారిత్రక కోణాన్ని మర్చిపోతున్నాం. మిద్దెల, మేడల ప్రస్తావనలు వచ్చినప్పుడు నాటి కాలపు దొరసానుల జీవిత చిత్రణ, పెత్తందార్ల దాష్టీకంలో పడుతున్న కష్టాల గురించి సీతతోనూ, తమ ప్రేమలు త్యాగాల వంటి విషయాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు శశిరేఖ, సతీ అనసూయలతోనూ పోల్చుకొని పాడుకుంటారు.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమస్యను తీసుకుని ప్రజలు పాటలుగా అల్లుకుంటారు. అందరికీ కామన్​గా ఉండేవి పౌరాణిక పాత్రలే. అందుకే వాటి చుట్టూనే స్థానిక విషయాలు ఉంటాయి.

‘మాపునేసిన పెద్ద చెరువు ఎన్నియాలో..

పొద్దున్నె తెగిపాయే ఎన్నియాలో…

ఆగవమ్మా… ఆగవమ్మా మల్లె చెరువు ఎన్నియాలో…

చెల్లెను శాంతమ్మనిస్త ఎన్నియాలో…’

అంటూ సాగే బతుకమ్మ పాటను గమనించండి. ఇందులో ‘చెరువు’ అనేది ఊరి పెత్తందారుకు మారుపేరు. అతను మహిళలను చెరబట్టే తీరును చెప్తున్నారు. బాగా పాడుకునే పాటల్లో బాలనాగమ్మ పాట కూడా ఒకటి. ఇందులో మహిళగా బాలనాగమ్మ పడిన కష్టనష్టాల ప్రస్తావన ఉంటుంది. రేణుకా ఎల్లమ్మ దేవి పాటలూ ఉంటాయి. స్త్రీ మూర్తులను దేవతలుగా మాత్రమే కొలవడం కాదు. వారు నాటి సామాజిక వ్యవస్థపై చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటారు. బతుకమ్మ అంటే ‘బతుకునిచ్చే అమ్మ’ మాత్రమే కాదు… ‘బతుకు కోసం పోరాడే అమ్మ’ కూడా. ప్రకృతి వనరులపై ఆధిపత్యం కోసం ఇప్పుడు సాగిస్తున్న అరాచకాలు… ప్రభువుల పాలనా కాలంలో –ప్రాంతం ఏదైనా సరే– స్త్రీని కేంద్రంగా చేసుకుని జరిగేవి.

దక్షిణ భారత దేశంలో స్త్రీల తిరుగుబాట్లు ఎక్కువ. తెలుగు సాహిత్యంలో బాలనాగమ్మ, రేణుకా ఎల్లమ్మ, సారలమ్మ, పోచమ్మలు కన్పిస్తారు. తమిళ సాహిత్యంలో మనకు కణ్ణగి కన్పిస్తుంది. వీరంతా కూడా నాటి ప్రభువులపై పోరాడినవారు. ఈ స్త్రీ మూర్తులు పెట్టిన శాపాలు, చేసిన త్యాగాలు అన్నింటినీ గుర్తు చేస్తుందీ బతుకమ్మ పండగ.

తెలంగాణలోని చాలాచోట్ల కేవలం బతుకమ్మ పండగ సందర్భంలోనే ఆటపాటలు సాగుతుంటాయి. అయితే, కొన్ని జిల్లాల్లో పండగ లేని రోజుల్లో కూడా తమ జీవితాన్ని తలపోస్తూ బొడ్డెమ్మ ఆటపాటలు జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలో ప్రకృతి కొత్తరూపు తీసుకుంటుంది. అందువల్ల ప్రకృతిని కొలుస్తూ కొన్ని ఆదిమ తెగలవారు ఇప్పటికీ పండగలు చేసుకుంటారు. సమాజం మారుతున్నా కొద్దీ చాలా మార్పులు వచ్చాయి. వీరందరూ పాడుకునే పాటల్లో ప్రకృతి ప్రసాదించే కొత్త పండ్లు, కాయలు మాత్రమే కాకుండా, వచ్చే యేడాది ఎట్లా ఉండబోతుందో కూడా తంగెళ్లు, బంతిపూలు, గునుగుపూలు, తీరొక్క పూలు పూచి, కాచే కాయల దిగుబడులను బట్టి కాలాన్ని అంచనా వేసుకోవడానికికూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రకృతిని బేరీజు వేసుకుని జరుపుకునే పండగ. ఆ రోజుల్లో ప్రసవాలు జరిగిన తర్వాత పిల్లలు బతుకుతారనే గ్యారెంటీ లేదు. కాబట్టి బిడ్డలు బతికినందుకు గాను ప్రకృతి మాతను లక్ష్మీ, పార్వతీ దేవి రూపంగా కొలుస్తారు. ప్రముఖ హిస్టారియన్​ బిరుదురాజు రామరాజు, మిక్కిలినేని  రాధాకృష్ణ వంటి వారు సేకరించిన జానపదాల్లో స్త్రీలు పాడుకునే పాటలే కాదు వారి జీవిత చిత్రణలు, సమాజంపై వారి అవగాహన, నాటి కాలాన్ని బట్టి, పాలకులను బట్టి ప్రజలు అల్లుకున్న పాటలు అన్నీ తెలుస్తాయి.

బతుకమ్మ పండగ సందర్భంగా రాజవంశాల ప్రస్తావన వస్తుంది. చోళ రాజ్యాల గురించి చెప్తారు. తెలుగు ప్రాంతానికి ఆనుకుని ఉన్న కాంచీపురం, తిరువల్లూరు వంటి ప్రాంతాల్లో కూడా బతుకమ్మ, బోనాల పండగ ఉనికి కన్పిస్తుంది. కాస్త అటుగా వెళ్తే మధుర మీనాక్షీకి సంబంధించిన మొక్కుబడులు, ఆటలు, పాటలు అన్నీ మన బతుకమ్మను పోలి ఉంటాయి. శక్తి పీఠాల్లోని అమ్మవార్ల ప్రతిరూపంగా, వారి పోరాటాల ప్రతిరూపంగా, సమాజాన్ని మలిచి, మేల్కొపే మాతృమూర్తులుగా  కొలుస్తారు.

తెలంగాణలో ఉద్యమానికి ఊపిరి పోసింది బతుకమ్మ.ప్రత్యేక తెలంగాణరాష్ట్ర సాధనలో పాటలై, అమ్మల అక్కలను ఉద్యమ గీతికలను చేసింది. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఊరువాడా ఏకం చేసింది. అన్నింటా తానై తెలంగాణ ప్రజల సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పింది. తల్లి గర్భానికి నవమాసాలు. అమ్మవారి కొలుపు తొమ్మిది రోజులు. అందుకే అమ్మ అనుగ్రహంకోసం ఆడతారు. పాడతారు. ఇదీ ఈ పండగ ప్రత్యేకత.-

– గొర్ల బుచ్చన్న