మగవాళ్ల బతుకమ్మ
బతుకమ్మ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పూలు, ఆడవాళ్లే. కానీ.. ఇక్కడ మాత్రం వెరైటీగా మగవాళ్లు చేసుకునే సంబురాలు గుర్తొస్తాయి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని తోటపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో ప్రతి ఏడాది మగవాళ్లు కూడా బతుకమ్మ ఆడతారు. ఆడవాళ్లతో కలిసి పాటలు పాడతారు. కాకపోతే ప్రతి రోజూ కాదు. మొదటి రోజు (ఎంగిలి పూల), చివరి రోజు (సద్దుల) రోజు మాత్రమే ఆడవాళ్లతోపాటు మగవాళ్లు కూడా చెరువు కట్ట దగ్గరకు వెళ్తారు. ఈ సంప్రదాయం ఎలా మొదలైందో తెలియదు. కానీ.. మగవాళ్లు మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు మగవాళ్లు ఆడే బతుకమ్మ ఆట చూడ్డానికి చుట్టు పక్కల ఊళ్ల నుంచి ఇక్కడికి చాలామంది వస్తుంటారు.
సీతంపేట.. నేతకాని బతుకమ్మ
వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేట గ్రామంలో ఏడాదికి రెండు సార్లు బతుకమ్మ పండుగ చేసుకుంటారు. ఇక్కడి నేతకాని కుటుంబాలు దీపావళి పండుగ నుంచి మూడు రోజుల పాటు బతుకమ్మ సంబురాలు చేస్తుంటారు. గంగ స్నానాలు చేసి రేగడి మట్టితో జోడెడ్ల బొమ్మలు తయారుచేసే సంప్రదాయంతో మొదలయ్యే ఈ సంబురాలు బతుకమ్మ నిమజ్జనంతో ముగుస్తాయి. పంటలు సమృద్ధిగా పండటంతో పాటు జనం సుఖసంతోషాలతో ఉండాలని సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు చేస్తుంటారు సీతంపేట ప్రజలు.