బతుకమ్మ చీరల తయారీలో 45.5 లక్షల మీటర్ల పాత క్లాత్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: నిరుడు బతుకమ్మ చీరల ఉత్పత్తి తర్వాత వ్యాపారుల దగ్గర మిగిలిపోయిన క్లాత్​ను టెస్కో అధికారులు సేకరిస్తున్నారు. దాదాపు 61 లక్షల మీటర్ల క్లాత్​మిగిలిపోయిందని, దీన్ని ప్రభుత్వమే కొనాలని వ్యాపారులు హ్యాండ్లూమ్, టెక్స్​టైల్ అధికారులను కోరగా వారు సానుకూలంగా స్పందించారు. ఇప్పటివరకు 45.5 లక్షల మీటర్ల క్లాత్​ను తీసుకున్నారు. ఇంకా10 లక్షల మీటర్ల క్లాత్​ కొనాల్సి ఉందని వ్యాపారులు చెబుతున్నారు. బతుకమ్మ చీరల సేకరణ తర్వాత ఏటా వ్యాపారుల దగ్గర మిగిలిన క్లాత్​ను ప్రభుత్వం కొంటున్నది. 

ఈసారి పెద్ద ఎత్తున పాత క్లాత్​ కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. పాత క్లాత్​ కొనుగోలుతో ఎక్కువగా లాభపడేది బడా వ్యాపారులే. చిన్న వ్యాపారుల దగ్గర 5 లక్షల మీటర్ల క్లాత్​ మాత్రమే మిగిలిందని, దాదాపు 56 లక్షల మీటర్లు బడా వ్యాపారుల నుంచే కొంటున్నారని తెలుస్తోంది. పాత క్లాత్​తో నేసిన చీరలనే ఈసారి పెద్ద సంఖ్యలో పంపిణీ చేయనున్నారు.

పర్యవేక్షణ కరువు

క్లాత్​ సేకరణలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు బట్ట నాణ్యతను పరిశీలించకుండానే వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకుని నాసిరకంగా ఉన్న క్లాత్​ను ప్రాసెస్ ​చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక గట్ట చెక్​ చేసినందుకు టెక్నికల్ ఆఫీసర్ రూ.60 నుంచి 80, పాత క్లాత్​ గట్టకు రూ.150  తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. నాణ్యత పరిశీలించాల్సిన జౌళి శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈసారి 5.54 కోట్ల మీటర్లకు ఆర్డర్​ 

బతుకమ్మ చీరల కోసం ఈ యేడు 5.54 కోట్ల మీటర్లు, బ్లౌజుల కోసం 68 లక్షల మీటర్ల క్లాత్​ను ఉత్పత్తి చేయాలని సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. 21 కలర్లు, 25 డిజైన్లలో చీరలను రెడీ చేయాలని సూచించింది. బతుకమ్మ చీరల ఉత్పత్తిలో 139 మ్యాక్స్ సంఘాలు,126 ఎస్ఎస్ఐ యూనిట్లు భాగస్వామ్యం అయ్యాయి. అయితే చీరకు సంబంధించి ఒక్కో మీటర్ క్లాత్​కు రూ.35.50, బ్లౌజు కోసం ఒక్కో మీటరుకు రూ.27గా ధర నిర్ణయించారు. దసరా సమీపిస్తుండడంతో టెక్స్​టైల్​ డిపార్ట్​మెంట్ చీరల సేకరణ ప్రక్రియను స్పీడప్ ​చేసింది. 

ఈ నెల 25 వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు 5 కోట్ల మీటర్ల క్లాత్​ను సేకరించారు. ఇందులో గత ఏడాది మిగిలిన 45.5 లక్షల మీటర్ల బట్ట, 4.55 కోట్ల మీటర్ల కొత్త క్లాత్​ ఉంది. ఇంకా 20 లక్షల మీటర్లు సేకరించాల్సి ఉంది. కోటి చీరలకు గాను ఇప్పటి వరకు 82 లక్షల చీరల సేకరణ పూర్తయింది. వాటిని హైదరాబాద్ కు తరలించి ప్రాసెస్​ చేస్తారు. ప్రాసెసింగ్ లో భాగంగా క్లాత్​కు కెమికల్స్ యాడ్ చేసి  ఫినిషింగ్ ఇస్తారు. బతుకమ్మ చీరలను మూడు రకాలుగా పంపిణీ చేస్తారు. 5.5 మీటర్ల  చీరకు బ్లౌజ్ సపరేటుగా ఇస్తారు. బ్లౌజ్ తో కలిపి 6.3 మీటర్ల చీరను, గ్రామాల్లో పెద్ద మనుషుల కోసం 9 మీటర్ల పెద్ద చీర ఇస్తారు.

పాత క్లాత్​ను సేకరించాం 

సిరిసిల్ల వ్యాపారుల వద్ద నిరుడు మిగిలిపోయిన క్లాత్​ను కొనుగోలు చేశాం. ఇప్పటికే 40 లక్షల మీటర్లు కొన్నాం. ఈయేడు బతుకమ్మ చీరల ఆర్డర్లకు అనుగుణంగా బట్టను సేకరించాం. పాత క్లాత్​తో గోదాం నిండిపోవడంతో కొత్త క్లాత్ సేకరణకు కాస్త సమయం పట్టింది. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. 40 లక్షల మీటర్ల క్లాత్​ మాత్రమే పాతది, మిగితాదంతా కొత్తదే.
‌‌‌‌‌‌‌‌ - సాగర్,  చేనేత జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల